ప్రేమతో.....అమ్మ

చిట్టి తల్లి....
      చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు నా  జీవితం అనే పుస్తకం పేజీలని వెనక్కి తిప్పి చూసుకుందాం అని అనుకుంటే .ఆశ్చర్యం...ఆ పేజీల నిండా నీ జ్ఞాపకాలే, నీవు చేసిన గుర్తులే....నా కోసం నేను ఎంత వెతుక్కున్నా...నా జాడ కనిపించలేదు ఎక్కడా.....అనుమానం వచ్చి ఇది నా జీవితమేనా అని మరల మరల తిప్పిన పేజీలనే ముందుకి,వెనక్కి, మరింత వెనక్కి తిప్పిచూసుకున్నా.అరె.....నేనేమైపోయాను.నా జ్ఞాపకాలు,నా అనుభూతులు ఏవి?.నిన్నటి దాకా నా గురించి నాకు రాని ఆలోచన ఇప్పుడే ఎందుకు వస్తోంది? యీ ప్రశ్నని పదే పదే నన్ను నేను వేసుకుని చూస్తే నేను అమ్మనైన తర్వాత మొదటిసారి నిన్ను ఎత్తుకున్న క్షణం నీవు క్యార్...క్యార్ మంటూ, ఇక నుండి  అమ్మ నాకే సొంతం అని నీ భాషలో చెప్పినట్లనిపించింది.నీ బోసి నవ్వులతో,చిన్ని చిన్ని తప్పటడుగులు నావైపు  వేస్తూ,నీ చిట్టి చేతులతో నన్ను హత్తుకుపోయిన క్షణం నుండి నా ప్రపంచం నీవే అయిపోయావన్న సంగతి ఇప్పటికి తెలిసివచ్చింది నాకు.  నీ చిన్ని నేస్తంగా మారిపోయూ నే బొమ్మల పెళ్లిళ్లు చేసిన జ్ఞాపకం.చిన్నప్పుడు చదవలేక వదిలేసిన హిందీ,సంస్కృతం అమ్మనైన తర్వాత  నీ కోసం నే నేర్చుకుని నీకు నేర్పుస్తూ పోటీ పడి నీతో చదువుకున్న జ్ఞాపకం.....నీవు గెలిచిన ప్రతిక్షణం నీ గెలుపు నా గెలుపుగా గర్వపడిన జ్ఞాపకం.....కాలంతో పాటు పోటీ పడుతూ నీ లక్ష్యాన్ని చేరాలన్న ప్రయత్నంలో నువ్వుంటె, ఇన్నాళ్లు నీ వెంటే పరుగులు తీసి అలిసిపోయిన నేను యిక నా పరుగు ఆపి,నీ చెయ్యి పట్టుకుని అనుక్షణం నీ తోడుగా నీ వెంటే ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్ధించా,అర్ధించా,కొన్ని కొన్ని సార్లు చనువుగా అసజ్ఞాపించా...   దేవుడు కదా,అమ్మ మనస్సు అర్థం చేసుకున్నట్లే ఉన్నాడు.నా స్థానంలో ఆయన నిలబడి ఇప్పటికి నిన్ను ముందుకు నడిపిస్తున్న గుర్తులు.    కాలగమనంలో ఎక్కడో దూరంగా ఆగిపోయిన నేను,మునుముందుకు మరింత వేగంగా పరుగులు తీస్తూ నీవు .., ఒక్కసారైనా వెనక్కి తిరిగి నన్ను చూస్తావేమూ అని ఆశగా నేను....,క్షణం ఆగినా గమ్యం చేరుకోవటం కష్టం అవుతుందన్న ఆలోచనలో నీవు... క్రమక్రమంగా దూరం పెరిగిపోతూ వంటరితనాన్నీ నాకందించేసి కాలం సాగిపోతోంది. యిన్నాళ్లకు, ఇప్పుడు అర్థం అయిన విషయం ఏమిటంటె.....నీ సంతోషం,నీ బాధ,నీ ఆలోచనలు,నీ కలలు....అన్నీ నావిగా చేసుకుని ,నీ పరుగు నేను తీశానని,ఇక పరుగు తీయలేక నేనాగిపోతే   నా నుండి విడిపోయి,నన్ను దాటుకుని పరుగులు తీస్తూ నీవు ముందుకి సాగిపొతున్నా,నా ఆలోచనలు నీ వెంటే అనుక్షణం  పరుగులు పెడుతూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాయని.....        మరేం భయంలేదులే చిట్టితల్లి , నా ఆలోచనలు నిన్ను అనుక్షణం పలకరిస్తూ నీవు ఎప్పటికి వంటరి దానవు  కాదని ధైర్యం చెబుతూనే ఉంటాయి.        మరి ఉంటాను . ప్రేమతో ...అమ్మ

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

పి.భా.స ....పెద్దలకు మాత్రమే