పి.భా.స ....పెద్దలకు మాత్రమే

   వారంరోజుల ముందుగానే యింటింటికి వచ్చి ఆదివారం జరగబోయే పి.భా.స సభకి రమ్మనమని నిర్వాహకులు పిలిచేసరికి అసలు యీ పి.భా. స సభ గురించి ఎప్పుడు విని వుండకపోవటంతో అదేంటో చూద్దామని మేము యిద్దరం వెళ్ళాం.అన్నట్లు చెప్పటం మరిచిపోయా.ఈ సభకి 15 సంవత్సరాలు దాటిన పిల్లలున్న పేరెంట్స్ మాత్రమే రావాలని రూల్ కూడా పెట్టారు.యిదేదో మాకు పనికివచ్చే విషయంలా నా సిక్స్తసెన్స్ చెప్పేసరికి వాళ్ళు చెప్పిన టైం కంటే అరగంట ముందుగా బయలుదేరి వెళ్ళాం.ఆడిటోరియం అంతా అప్పటికే మాలాంటి పేరెంట్స్ తో నిండిపోయి ఉంది.ఎలాగో అలా అందరిని  తోసుకుంటూ ముందుకు వెళ్ళి ఒకరిద్దరితో పొట్లాడి మరీ కష్టపడి సీట్లు సంపాదించి  కూర్చుని చూద్దుము కదా.. అక్కడి వచ్చిన పేరెంట్స్  అందరి మోహల్లో అక్కడేదో అద్భుతం జరగబోతోందన్న ఫీలింగ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
     మెల్లిగా సభ ప్రారంభమైంది. ఒక్కొక్కరిగా వచ్చి పరిచయం చేసుకున్న నిర్వాహకులు, సభాదక్షుడు  ఉపన్యాసాలతో గంటలు గంటలు ఉదర కొట్టకుండా క్లుప్తంగా మాట్లాడి  యిక పి.భా.స గురించి మాట్లాడమని ఆ రోజు ముఖ్య అతిధిగా పిలిచిన పెద్దమనిషిని ఆదరంగా ఆహ్వానించారు.అప్పటిదాకా రిలాక్సడ్ గా కూర్చున్న పేరెంట్స్ అందరూ ఆయన ఏం చెబుతాడా అని  శ్రద్దగా వినటం మొదలుపెట్టారు.యిక ఆ పెద్దమనిషి యిలా మాట్లాడటం  మొదలుపెట్టాడు.అసలు పి.భా.స అంటే....అంటూ ఒక్క క్షణం ఆగి కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకుంటూ మా అందరి ఫీలింగ్స్ కనిపెడుతూవుంటే , ఆయన ఏం చెబుతాడా అని మేమంతా  ఊపిరి బిగపెట్టి చూస్తున్నాం .అసలు పి.భా.స అంటే పిల్లల బాధితుల సంఘం అన్న మాట....అని చెప్పేసరికి ఒక్కసారిగా సభలో అందరూ ఆశ్చర్యపడి ఒకరితో ఒకరు గుసగుసలాడటం  మొదలు పెట్టారు.మళ్ళీ ఆ పెద్ద మనిషి మాట్లాడటం మొదలుపెట్టి ఆయన  పిల్లలతో పడిన కష్టాలు చెబుతూ ఉండేసరికి అది వింటున్న మేమందరం మనస్సులో అరె... యిది అచ్చు మా ఇంటి కథలా ఉందే అని తెగ ఆశ్చర్యపడిపోతూ వింటూ వుంటే, మాలో కొందరికి వాళ్ళ పిల్లలతో వాళ్ళు పడుతున్న బాధలు గుర్తుకొచ్చి సైలెంట్ గా పమిట కొంగులతో కళ్ళు,ముక్కు తుడుచుకుంటూ ఉంటే మగ వారు కర్చీఫ్ లు తడిపేయటం మొదలుపెట్టారు.మరికొందరు ఎమోషన్స్ తట్టుకోలేక స్టేజి ఎక్కి మరీ వాళ్ళ పిల్లలతో వాళ్ళు పడుతున్న బాధలు చెప్పారు. యిలా ఒకళ్ళని చూసి మరొకరు పోటీలు పడి స్టేజి  ఎక్కి వాళ్ళవాళ్ళ బాధలు చెబుతుంటే నేను వాళ్ళ వంక జాలిగా చూస్తూ ఉన్నా.ఈ లోపు  మా వారు ఎవ్వరూ వినకుండా నా చెవిలో "యిది ఎలా ఉందంటే నా కొడుకు వెధవ అని ఒకడంటే, నీ కొడుకు ఉత్తి వెధవే ... నా కొడుకు వెధవన్నర వెధవ అని  గొప్పగా అందరికి చాటి చెబుతున్నట్లు వుంది" అని గొణిగేసరికి నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది.ఈ తతంగం చాలా సేపు జరిగిన కొంతమంది సీనియర్లు వాళ్ళ వాళ్ళ స్వీయ అనుభవాల్ని చెబుతుంటే మాలో చాలా మందికి ఫ్యూచర్ లో వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఎదుర్కోబోయే సమస్యలు కళ్ళ ముందు కనిపించి కన్నీటి పర్యంతం అయ్యారు. అంతలోనే చుట్టు ఉన్న పేరెంట్స్ ని చూసుకుని  ఈ పోరాటంలో తాము ఒంటరివాళ్ళం కాదని అనుకుంటూ ఎవరికి వాళ్ళు ధైర్యం తెచ్చుకుని పక్కవాళ్ళకి ధైర్యం చెబుతూ కనిపించారు.యిది అంతా విని, చూసిన తరువాత నాకు  అర్ధం అయ్యింది ఏమిటంటే పక్కవాడి కష్టాలతో పోల్చుకుంటే మనది ఒక కష్టమేనా....అని మొండి ధైర్యం, తెగింపు, రిలీఫ్ చాలామందిలో కనిపించాయి.
      సభని ముగిస్తూ యిలా అప్పుడప్పుడు మనం అందరం కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల  పేరెంట్స్ అందరికి  ఆత్మస్థైర్యం పెరగటంతో పాటు ముందు ముందు వాళ్ళ పిల్లలతో రాబోయే సమస్యలని ఎలా ఎదుర్కోవాలో  సీనియర్లుని అడిగి వారి సలహాలు,సూచనలు  పాటించాలని చెబుతూ  మారుతున్న కాలంతో పాటు మన ఆలోచనాధోరణీ కూడా మార్చుకోవాలని పేరెంట్స్ అందరికి కౌన్సిలింగ్ యిస్తూ ధైర్యం చెప్పారు.
     యిదంతా విని  ఆ కొద్ది సమయంలోనే   ఒకరి బాధలు ఒకరితో పంచుకోవటం వల్ల ఆత్మ బంధువుల్లా ఫీల్ అయిపోతూ మేమందరం   ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మళ్ళీ త్వరలో కలుసుకుందాం అని మాట యిస్తూ  తేలికపడిన మనస్సులతో ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకుని యిళ్ళకి బయలుదేరాం.అలా నడుస్తూ వస్తుంటే నా చిన్నప్పుడు ఎప్పుడూ మా పెద్ద నాన్న అనే మాట గుర్తుకొచ్చి నేను మొహం గంభీరంగా పెట్టుకుని వయసుకి వచ్చిన పిల్లల విషయంలో పేరెంట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళల్లా,చెవులు ఉండి చెవిటి వాళ్ళల్లా, నోరు ఉండి మూగ వాళ్ళల్లా ఉంటే అందరి యిళ్ళల్లో ఎంతో కొంత ప్రశాంతత ఉంటుంది అని నా సొంత కొటేషన్ లా చెప్పేసరికి మా వారు నా వంక ఆశ్చర్యంగా చూస్తూ రోడ్డు మీద ఉన్నామన్న విషయం కూడా మరిచిపోయి చప్పట్లు కొట్టేశారు.
     యిక కధ కంచికి...మనం యింటికి.

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ