మా బడి మాకెంతో ఇష్టం...
రోజులు మారిపోతున్నాయి అని అనుకునే కంటే మనం మారిపోతున్నాం అని అనుకుంటే బాగుంటుందేమో.ఎందుకంటే రోజులు ఎప్పటిలా వాటి మానాన అవి సాగిపోతున్నాయి.కానీ మార్పు వచ్చింది వాటిల్లో కాదు, మనలో.
అర్థం కాలేదా...కొంచం క్లారిటీ యిస్తా..ఉండండి.మన చిన్నప్పుడు మనం అమ్మానాన్నల మాట వింటూ పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం.యిప్పుడు కూడా మనం అదే పని చేస్తున్నాం.కానీ మనలో చిన్న మార్పు ...మనం యిప్పటికీ మన పెద్దవాళ్ళ మాటకి విలువ యిస్తున్నాం,మన పిల్లలు చెప్పేది కూడా వింటున్నాం.యిదంతా ఎందుకు చెబుతున్నానంటే నాలో వచ్చిన ఈ మార్పు మీ అందరిలో కూడా వచ్చింది, వస్తూనే ఉంది కాబట్టి....
నిన్న ఏం జరిగిందంటే... యిదేమి అంత పెద్ద విషయం కాదు లెండి.అయినా మీ అందరితో చెప్పుకోవాలనిపించి చెబుతున్నా...కొంచెం ఓపిక చేసుకుని చదవండి.
ఆ......యిక అసలు విషయానికి వస్తున్నా.నిన్న మా అమ్మాయి పెన్స్ కొనుకోవటానికి డబ్బులు అడిగింది.వారం క్రితమే అరడజను పెన్స్ కొన్నావుగా అని నేనంటే,అవి ప్రాక్టీకల్స్ కి వాడేశా.ఇప్పుడు థియరీ ఎక్సమ్స్ కి మళ్ళీ కావాలి అని అనేసి వెళ్ళిపోయింది.ఏం చెబుతాం...ఈ జనరేషన్ పిల్లలకి....చెబితే వింటారా?.అంతా use and throw వ్యయహారం అయిపోయింది.మొన్నటికి మొన్న మొబైల్ కావాలని అడిగింది. కొని పట్టుమని పది నెలలు కూడా కాలేదు కదా,అప్పుడే ఎందుకు అని ఈసారి ఈయన ఆశ్చర్యంగా అడిగారు.అది ఓల్డ్ వెర్షన్ అయిపోయింది.లేటెస్ట్ వెర్షన్ మొబైల్ కావాలని అడిగింది.అందుకు అది చెప్పిన కారణం విన్న తరువాత అది చెప్పిన దానిలోనూ పాయింట్ ఉంది అనిపించింది.ఎప్పటికపుడు మారుతున్న టెక్నాలజీతో పాటు మనం మారకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుక పడిపోతాం అని అనిపించింది.అందుకే ఈ మధ్య ఎప్పుడు దేనితో ఏం అవసరం వస్తుందో ఆని నేను మా అమ్మాయితో పోటి పడుతూ ,నెట్ బ్యాంకింగ్,స్కైప్,ఫేస్ బుక్,ట్విట్టర్,వాట్సాప్...ఇలా ఏది వదలకుండా అన్నిటిలో నా వాడకం అంటే ఎలా ఉంటుందో చూపించేస్తున్నా.
కానీ ఈ ఉరుకులుపరుగుల లైఫ్ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ ఎలా ఎంజాయ్ చేశామో గుర్తుకు వచ్చి యిప్పటి పిల్లలు ఏం మిస్ ఆవుతున్నారో అన్నీ చూస్తూ కూడా వాళ్ళు పొందలేక పోతున్న బాల్యం నాటి మధుర స్మృతులు,ఆటలు వాళ్ళకి యివ్వలేకపోతున్నాం అని చాలా బాధ వేస్తూ ఉంటుంది.
ఈరోజు మీ అందరితో మీకు గుర్తు ఉన్న,మీరు మరిచిపోయిన స్కూల్ డేస్ మరొక్కసారి గుర్తు చేసుకుందాం అని ఇలా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా.
మనం చిన్నప్పుడు స్కూల్లో యింకు పెన్నులు వాడేవాళ్ళం.మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది.పెన్నులో యింకు పోసినందుకు ఐదు పైసలు యిచ్చేవాళ్ళం.
ఒక్కొక్క క్లాస్ పాస్ అయ్యి పెద్ద క్లాసులకి వెళ్తున్నప్పుడు మన అక్క,అన్నలు వాడేసి మనకి యిచ్చేసిన టెక్స్ట్ పుస్తకాలు మురిపంగా చూసుకుంటూ వాటినే మళ్ళీ మనం వాడుకునేవాళ్ళం.
ముందు క్లాస్ పుస్తకాలలో మిగిలిన కాళీ పేజీలతో రఫ్ పుస్తకం కుట్టుకునేవాళ్ళం .
అప్పుడే కొత్తగా వచ్చిన సెంట్ ఎరెజర్, నటరాజ్, కెమిలిన్ పెన్సిల్ బాక్సులు వాడిన జ్ఞాపకం.
రోజూ స్కూలుకి వెళ్ళేటప్పుడు అమ్మ,నాన్న ఇచ్చే పావలా,అర్ధరూపాయి సాయంకాలానికి దాచుకుని కాళ్ళకి హవ్వయి చెప్పులతో దారి పొడుగునా స్నేహితులందరిని ఒక్కొక్కరిని కలుపుకుని అరగంట ముందే స్కూలుకి వచ్చి స్కూలు గేటు తెరిచేటంతవరకు గేట్లు పుచ్చుకుని వెళ్ళాడే నేస్తాలు కొంతమంది,మరికొంత మంది ముందు రోజు టీచర్ ఇచ్చిన హోమ్ వర్కని ఫ్రెండ్స్ బుక్స్ల్ నుండి కాపీ కొట్టేస్తూ, గేటు తెరవగానే బ్యాగులు లైన్లో పెట్టేసి స్కూలు బెల్ మోగేంతవరకు ఆడుకోవటానికి పరుగులు తీసే అంతమంది.
మీకు గుర్తు వుండే ఉంటుంది....ఆడుతూ పాడుతూ పరీక్షలు రాసేసి తరువాత టీచర్స్ కరెక్షన్ చేసి తీసుకుని వచ్చే ఆన్సర్ షీట్స్ చూసి టెన్షన్ పడిపోయేవాళ్ళం.మనలో పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గిన వెక్కి వెక్కి ఏడ్చిన ఫ్రెండ్స్ వున్నారు,బొటాబొటి మార్కులతో పాస్ అయిపోయీ ఏనుగు ఎక్కినంత సంబరపడిపోయే ఫ్రెండ్సు ఉన్నారు.మరి కొంతమంది వాళ్ళకి వచ్చిన ఆ నాలుగు మార్కులనే నలభై సార్లు లెక్కపెట్టుకుంటూ ఎలా అయినా పాస్ అయిపోదాం అని విశ్వప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు.
ఎప్పుడు టై,టక్,షూస్ తో ఉండి డ్రిల్ల్ ఛాన్స్ కొట్టేసే ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్ ని చూసి పళ్ళు నూరుకున్న రోజులూ నాకు యింకా గుర్తు ఉన్నాయి.
ఉత్తప్పుడు ఏరా,ఒరేయ్ అనుకునే ఫ్రెండ్స్ అందరం స్పోర్ట్స్ డే వచ్చేసరికి,నా సెక్షన్...నీ సెక్షన్ అంటూ విడిపోయీ పోటీ పడి మరీ ఆడేవాళ్ళం. మళ్ళీ అంతలోనే తెలుగు మీడియం ఫ్రెండ్స్ అందరూ ఒక్కటై ...మాలో ఏ సెక్షన్ గెలిచినా పర్వాలేదు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం గెలవకూడదని గట్టి పోటీ ఇచ్చేవాళ్ళం. ఆ క్షణంలో ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్ అందరూ ఆంగ్లేయులు,తెలుగు మీడియం ఫ్రెండ్స్ అందరం స్వచ్చమైన భారతీయులంలా ఫీల్ అయిపోయేవాళ్ళం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులే ఉన్నాయి.నాకు గుర్తు ఉన్న విషయాలు చెబుతా....
*లేట్ కమర్స్ తో ప్లే గ్రౌండ్లో పడి ఉన్న చిత్తు కాగితాలు ఏరించి పది పైసలు ఫైన్ తీసుకునే PET మాస్టర్స్.
*లలితా సాగరి ప్రేయర్ సాంగ్,డ్రిల్ల్, న్యూస్ పేపర్ రీడింగ్ తో మొదలయ్యే క్లాసులు.
*ఆడి పడిపోయి దెబ్బ తగిలితే దెబ్బ మీద PET టీచర్ వేసే టించరు మంట అసలు దెబ్బ కన్నా ఎక్కువగా ఉండి అరిచి గోల చేసే ఫ్రెండ్స్.
*ప్రతి సంవత్సరం వేసే టీకాలు..ఏడ్చి గగ్గోలు పెట్టె ఫ్రెండ్స్ కొంతమంది,తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నించే ఫ్రెండ్స్ కొంతమంది,వీళ్ళని చూసి నవ్వుకునే ఫ్రెండ్స్ మరికొంతమంది.
*ఏ రోజైనా టీచర్ స్కూలుకి రాకపోతే తెగ సంబరపడిపోతూ ఆడుకోవటానికి పరుగులు తీసే ఫ్రెండ్స్ .
*పరీక్షలు రాస్తున్నప్పుడు ఆన్సర్ షీట్స్ మీద షీట్స్ తీసేసుకుంటూ చుట్టుపక్కలవాళ్ళని భయపెట్టె ఫ్రెండ్స్ కొంతమంది,ఇచ్చిన మొదటి పేపరే ఎలా నింపాలో తెలియక తికమక పడే ఫ్రెండ్స్ కొందరు.
*బిట్ పేపర్లో multiple ఛాయిస్ క్వశ్చన్ కి రకరకాల సైగలతో ఆన్సర్స్ చెప్పుకునే ఫ్రెండ్స్ కొంతమంది అయితే, ఏ ప్రశ్నకి గ్రాఫ్ వేయాలో,మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలో అర్థం కాక పక్కవాడి పేపర్ లోకి పదే పదే తొంగి చూసే స్నేహితులు
*యిక కాపీలు కొట్టడానికి కొత్త కొత్త దారులు,సైగలు కనిపెట్టె మేధావులు కొంతమంది.
*స్కూల్ డ్రెస్సుల మీద ఇంకు గుర్తులు,వేళ్ళ మీద పెన్సిల్ ని బ్లేడ్ తో చెక్కిన గుర్తులు.
*లంచ్ టైంలో ఎవరి లంచ్ ఎవరు తింటున్నారో తెలియనంతగా అరమరికలు లేని ఫ్రెండ్స్.
*ప్లే గ్రౌండ్ లో ఆడుకున్న ఆటలు, ఆటల్లో వచ్చే తగదాలకి ఒకరితో ఒకరు కలబడి పట్టిన కుస్తీ పట్లు,సంగీతం క్లాసులో పోటీలు పడి పాడుకున్న పాటలు .
*స్కూలు గేట్ దగ్గర పెన్సిల్,పెన్స్,బుక్స్, ,బిళ్ళలు, చాకలెట్లు, పాపిన్స్...ఒకటి ఏమిటి,ఇలా సమస్తం దొరికే అప్పారావు,ప్రసాద్ ల మినీ సూపర్ మార్కెట్ తోపుడు బళ్ళు.
*బంద్ ,స్ట్రైక్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్లిపోతూ దారిపొడుగున స్కూలుకి వచ్చే పిల్లలందరికీ ఈ రోజు హాలిడే అని గట్టిగా ఆరుస్తూ అనౌన్స్మెంట్ చేస్తూ ఆనందపడే ఫ్రెండ్స్.
*వర్షం పడితే ఆనందంగా ఆ వానలోనే తడుస్తూ మధ్య మధ్య రోడ్డు మీద నిలిచే నీటిగుంటల్లో ఎగిరి దూకుతూ ఆడుకునే ఫ్రెండ్స్.
*స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మానాన్నలు యిచ్చిన చిల్లర పైసలతో ఉప్పు,కారం అద్దిన జామకాయలు,మామిడికాయ ముక్కలు,ఉసిరికాయలు,తాటి చేపలు,పుల్ల ఐస్... కొనుక్కుని స్నేహితులందరితో పంచుకుంటూ చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ ఇంటిదారి పట్టే నేస్తాలు.
మనలోనే వీళ్ళందరు ఉన్నారు.మరి వీళ్ళల్లో మీకు మీరు కనిపించారా...?.యివి అన్ని మీతో చెబుతుంటే ...నాకు మళ్ళీ మనం అంతా చిన్న పిల్లలుగా మారిపోయీ ఆ స్కూల్ డేస్ ని మీ అందరితో ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది .మరి మీ సంగతేంటి?.
Comments
Post a Comment