పొద్దున్నే అలారమ్ మోతకి నిద్ర లేచిన నేను రెండే రెండు నిమిషాల్లో మొహం కడుక్కుని వచ్చి,అర సెకను గడియారం వంక చూసి యిక పరుగుకి నేను రెడి అన్నట్లుగా పమితకొంగుతో మొహం తుడిచేసుకుంటూ, రాత్రి నిద్రలో రేగిపోయిన జుట్టుని మునివేళ్ళతో పైపైన అలా దువ్వి ముడి పెట్టేసుకుంటూ, వాకిట్లో అప్పటికే సిద్ధంగా ఉన్న పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ తీసుకుని వచ్చి పేపర్ పక్కన పెట్టెసి,పాల ప్యాకెట్ కత్తిరించి గిన్నెలో పోసి,అలవాటు అయిపోయిన బడ్జెట్ పద్మనాభంలా పెద్ద గ్లాసుడు నీళ్ళు అందులో కలిపేసి స్టవ్ వెలిగించి,పాలు పొంగేలోపు గబగబా వాకిలి చిమ్మేసి,ముగ్గు పెట్టి,అదే ఊపులో దేవుడి గదిని కూడా శుభ్రం చేసేసుకుంటూ మధ్య మధ్యలో పొంగటానికి రెడీగా ఉన్న పాలు చూసుకుంటూ ముందురోజు రాత్రి వేసిన ఫిల్టర్ కాఫీ డికాషిన్ తో కాఫీ కలిపేసుకుని నోరు కాలిపోతున్నా పట్టించుకోకుండా,ఫిల్టర్ కాఫీ వాసనకి నిద్ర మత్తు అలా అలా దిగిపోతూ ఉంటే కక్కుర్తిగా వేడి వేడి కాఫీ తాగేసి హడావుడిగా వెళ్ళి రెండు చెంబులు నీళ్ళు పోసుకుని వచ్చి ఫ్రిడ్జిలో ముందు రోజు రాత్రి తరిగిపెట్టుకున్న కూరముక్కలని మూకుడులో తాలింపు వేసి అందులో పడేసి,దానిలోనే ఉప్పు, పసుపు, కారం వేసి,రెండో స్టవ్ మీద కుక్కర్ ఎక్కించేసి పిల్లలకి పాలు కలిపేసి,మార్నింగ్ వాకింగ్ టైం అయ్యింది అంటూ శ్రీవారిని నిద్ర లేపి,ఒక పక్క రెడి అయిపోయిన కూరని కిందకి దింపి చారు పెట్టెస్తూ ఈలోపు పిల్లల స్కూల్ బ్యాగులు,వాటర్ బాటిల్స్ సర్దేస్తూ అంతలోనే చారు మరుగుతున్న వాసనకి ఒక్క పరుగున వంటింట్లోకి వచ్చి పడి, చారులో తిరగమోత పెట్టేసి రాత్రికి కూడా ఉంటుందని అనుకుంటూ నాలుగు టొమాటోలు, రెండు పచ్చిమిరప కాయలు,చింతపండు,పోపు వేసి మగ్గపెట్టి పచ్చడి గ్రైండ్ చేసేసి ఒక్కక్షణం గడియారం వంకే చూసి అమ్మో...స్కూల్ టైం అయిపోతోందని పిల్లలిద్దరిని నిద్ర లేపుదామని చూస్తే పెద్దోడు యింకో రెండు నిముషాలు అంటూ మళ్ళీ ముసుగు తన్ని పడుకుంటే, చంటిది రోజూలానే ఈ రోజు కూడా స్కూలుకి వెళ్ళనని మారం చేస్తుందా.. రెండు నిముషాలు పిల్లలిద్దరిని బుజ్జగించి ,వాళ్ళు మాట వినకపోయేసరికి ఇక లాభం లేదనుకుని పెద్దోడికి ఒక్కటి తగలనిచ్చి, నోట్లో బ్రష్ పెట్టెసి వాష్ బేసిన్ ముందుకు తోసేసి చంటిదాన్ని ఎత్తుకుని తీసుకెళ్లి రెండు చెంబుల నీళ్లు బడబడా పోసేస్తూ అక్కడే దాని పళ్ళు కూడా తోమేసి,అది ఏడుస్తున్న లెక్క చేయకుండా దానికి స్కూల్ డ్రెస్ వేసేసి,ఒక పక్క జడలు వేస్తూ యింకో పక్క ముందుగా కలుపుకొచ్చిన పప్పన్నం స్పూన్లతో దాని నోట్లో పెట్టెస్తూ నేను హడావిడి పడిపోతూ ఉంటే ఇంతలో స్నానం కానిచ్చి స్కూలుకి రెడి అయిపోయిన మా పెద్దోడు ఎప్పటిలానే హోంవర్క్ చేయటం మరిచిపోయా ...అని అంటూ పుస్తకం పుచ్చుకుని ఎదురుగా వచ్చి నిల్చునేసరికి వాడి మీద కోపం వచ్చినా,వాడి బిక్కమొహం చూసి జాలేసి వాడితో హోంవర్క్ చేయిస్తూనే చంటిదానికి షూస్ వేసి మెడలో స్కూల్ ఐడెంటిటీ కార్డ్తో పాటు వాటర్ బాటిల్ తగిలించేసి ,పిన్నీసుతో రుమాలు కూడా దాని డ్రెస్సుకి గుచ్చి,ఏడుస్తున్న చంటిదాని చేతిలో రెండు చాకలెట్లు పెట్టి, పెద్దోడిని అన్నం తింటూ ఉండమని చెప్పి చంటిదాని స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్సుతో సహా దాన్ని ఎత్తుకుని వెళ్ళి గుమ్మంలో సిద్ధంగా ఉన్న ఆటోలో కుదేసి ఆటో బయలుదేరగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా జిడ్డోడుతున్న మొహానికి పౌడర్ పట్టించేసి యింకా కంచంతో కుస్తీ పడుతున్న పెద్దోడికి గబగబా అన్నం పెట్టేసి,వాడిని తీసుకొని ఇల్లు తాళం పెట్టబోతుంటే బల్ల మీద పాల గ్లాసులు కనిపించి,చంటిది ఈ రోజు కూడా పాలు తాగలేదన్న విషయం గుర్తు వచ్చి ఒక్క క్షణం మనస్సు చివుక్కుమనిపించినా ఇంతలో పెద్దోడు గుర్తు వచ్చి,ఇప్పుడే అన్నం తిన్నా అని వాడు గోల చేస్తున్నా...వినిపించుకోకుండా బలవంతంగా వాడితో పాలు తాగించేసి వాడిని తీసుకుని ఇంట్లోంచి బయటపడి ఉరుకులు,పరుగులు తీస్తూ బస్ స్టాప్ లో అప్పటికే బయలుదేరాటానికి సిద్ధంగా ఉన్న స్కూల్ బస్ ఎక్కించేసి హమ్మయ్య...ఈరోజు బస్ మిస్ అవ్వలేదు అని అనుకుంటూ ఇంటికి వస్తూ దారిలో కనిపించిన పాలకూరని బేరం ఆడి తీసుకుని యిక ఈయన వాకింగ్ నుండి వచ్చే టైం అయ్యింది అని అనుకుంటూ హడావుడిగా ఇంటికి వచ్చేసి బల్ల మీద ఎదురుగా కనిపిస్తున్న చంటిదాని పాల గ్లాస్ చూసి నా మతిమారుపుకి ఏం తిడతారో అని అనుకుంటూ చప్పగా చల్లరిపోయిన పాలని ఎత్తిన గ్లాస్ దింపకుండా గడగడా తాగేసి,ఇక ఈ పూటకి టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించి నిన్న రాత్రి మిగిలిపోయిన చద్దన్నం గుర్తుకి వచ్చి పనిమనిషి రంగికి యిచేద్దామా అని అనుకుని అంతలోనే మండిపోతున్నబియ్యం రేట్లు తలుచుకుని మూకుడులో తాలింపు వేసి పచ్చిమిరప,కరివేపాకు, వేరుశనగ పప్పు వేసి నిమ్మకాయ పులిహోర చేసేసి పక్కన పెట్టి అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన శ్రీవారితో పాటు కూర్చుని మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగేస్తూ, మధ్య మధ్య కబుర్లు చెబుతూ కాఫీ అయ్యేలోపు న్యూస్ పేపర్ పైపైన అలా అలా తిరగేసి యిక ఆఫీస్ టైం అవుతోందంటూ ఈయన,వంటింట్లో పని ఉంది అంటూ నేను మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాం.ఈయన స్నానం చేసి ఆఫీసుకి రెడి అయ్యి వచ్చేలోపు నేను ఈయన లంచ్ బాక్స్ రెడి చేసేసి టీఫిన్ ప్లేట్ ఈయనకి అందించేసి,పుట పూటా మిగిలిపోయిన అన్నంతో యిలా టిఫిన్ చేసి పెడుతున్నానని ఈయన గొణుక్కుంటున్నా,అసలేమి విననట్లే నేను పూజ గదిలో దీపం వెలిగించి నాలుగు పటికబెల్లం పలుకులు దేవుళ్ళకు నైవేద్యం పెట్టేసి హారతి యిచ్చేసి మిగిలిన పూజ కాసేపటికి వాయిదా వేసి రెండు పటికబెల్లం పలుకులు నే నోట్లో వేసుకుని,అప్పటికే ఆఫీసుకి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న ఈయనకు ప్రసాదం పెట్టి,గుమ్మం దాకా వచ్చి సాగనంపి యిక మధ్యలో ఆపేసిన పూజని పూర్తి కానిచ్చి,చిందర వందరగా ఉన్న ఇల్లు సర్దుకుని అక్కడితో నా మార్నింగ్ రన్ కి ముగింపు పలికేస్తూ.... టిఫిన్ తినేస్తూ సగంలో చదివి వదిలేసిన న్యూస్ పేపర్
అందుకుంటా .
Comments
Post a Comment