అమ్మ చేతి ముద్ద
అమ్మ చేతిలో ఏముందో ఏమిటో తెలియదు కానీ ఆకలి లేదంటూ మారం చేస్తున్న నాకు అమ్మ ఆకాశంలో చందమామని చూపిస్తూ కధలు చెబుతూ ఎంతో ప్రేమగా గోరుముద్దలు పెడుతూ వుంటే నేను ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టుకుంటూ అమ్మ చెప్పే కథలకి ఊ.. కొడుతూ అన్నం తినేసి అలానే అమ్మ ఒడిలో నిద్ర పోయాను.కలలో దేవుడు నా నేస్తం కన్నయ్యలా కనిపించి నాతో ఎన్నో ఆటలాడుకున్నాడు.మేము ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడుకున్నాం,చిటారు కొమ్మలెక్కి చిలుక కొట్టిన దోర జామపండ్లు కోసుకుని తిన్నాం,ఆ పైన దాహం వేసి సెలయేటి నీళ్లు తాగి,అంతటితో ఊరుకోకుండా ఒకరితో ఒకరు పోటీ పడి పరుగు పందాలు వేసుకున్నాం.ఆడి ఆడి అలసిపోయిన సన్ను కన్నయ్య తన వేణుగానంతో ఎంతో సేపు మురిపించాడు. వేణుగానం ఆగేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూసిన నేను అమ్మ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా బిక్కమొహం వేసుకుని కన్నయ్య నన్ను ఎంతగా పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇంటికి పరుగు తీశాను. నా బిక్కమొహం చూసిన కన్నయ్య కూడా పరుగు తీస్తూ మా ఇంటికి వచ్చేశాడు. అలా నేను గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మ పరుగు పరుగున వచ్చి నన్ను అక్కున చేర్చుకుని," ఇంతసేపూ ఎక్కఫున్నావురా బుజ్జి?.నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా"అని అంటూ అంతలోనే నా వెనుకే పరుగు తీస్తూ వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయీ తల మాత్రం లోపలకి పెట్టి లోపలకి రానా...వద్దా... అన్నట్లుగా అమాయకంగా చూస్తున్న కన్నయ్యని చూసి అమ్మ మురిపంగా నవ్వుకుని గబగబా కన్నయ్య దగ్గరకి వెళ్ళి,కన్నయ్యని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని,"బాగున్నవా కన్నయ్య..ఎన్నాళ్లకి కనిపించావు " అని ఎంతో ప్రేమగా పలకరిస్తూ,రండి...రండి,అన్నం తిని ఆడుకోండి అని అంటూ చనువుగా మా ఇద్దరి చెరో రెక్క పుచ్చుకుని వంటింట్లోకి తీసుకుని వెళ్లి కంచం నిండా నాకెంతో యిష్టం అయిన పప్పన్నం బాగా నెయ్యి వేసి కలిపి ముద్దలు చేసి మా చేతుల్లో పెట్టసాగింది. అమ్మ చేతి ముద్ద కోసం ముందు సిగ్గుగా,మొహమాటంగా చేయీ చాచిన కన్నయ్య ఆ ముద్దలో అమ్మ ప్రేమనే చూశాడో, యశోదమ్మనే చూశాడో తెలియదు కాని పక్కన నేను ఉన్నానన్న సంగతి కూడా మరచిపోయి చనువుగా చేయీ చాచి అమ్మ చేతి ముద్దలు బొజ్జ నిండా తినేశాడు. ఇక మా ఆకలి తీరిందని అమ్మ తృప్తి పడి మా చేతులు కడిగి తన పమిట కొంగుతో మా చేతులకి ఉన్న తడితో పాటు ఆడుకుని మొహాలకి పట్టిన చెమటని కూడా తుడిచి యిక అడుకోండంటూ అనటం ఆలస్యం, నేను కన్నయ్య చేయీ పట్టుకుని మళ్ళీ ఆడుకోవటానికి పరుగు తీయబోతుంటే, కన్నయ్య నా చేయి పట్టుకుని ఆపి,నన్ను ఎంతో ప్రేమగా హత్తుకుని,'ఒరేయ్ బుజ్జి!నాకు కూడా అమ్మని చూసి అమ్మ చేతి ముద్దలు తినాలని వుందిరా. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది,ఆడుకోవటానికి మళ్ళీ వస్తానే.."అని అంటూ మాయమయిపోయాడు.'కన్నయ్యా...ఆగు,నేనూ వస్తున్నా అని పెద్దగా కలవరిస్తూ నిద్ర లేచిన నన్ను అమ్మ మరింతగా దగ్గరకి తీసుకుని,భయం లేదురా కన్నా...నేను నీ పక్కనే ఉన్నాగా అని అంటూ నవ్వుతూ జో...కొట్టసాగింది. అమ్మ నవ్వు కన్నయ్య నవ్వులా కనిపించి కన్నయ్యనే తలుచుకుంటూ అమ్మ ఒడిలో మరింతగా దూరిపోయీ మళ్ళి నిద్రలోకి జారుకున్నా.
Let's taste the unconditional love of our mothers...
ReplyDeleteHi Sandhya. First of all hearty congratulations for launching blog. The post in blog on mother's affection is super. Keep on posting some batane elu.
ReplyDeleteHi Sandhya. First of all hearty congratulations for launching blog. The post in blog on mother's affection is super. Keep on posting some batane elu.
ReplyDeleteHearty congrats Sandhya. You have started your blog with mothers affection. Simply superb. Keep it up.
ReplyDelete