మైమరపించిన వేణుగానం....

                                                                                                                                                                         నీ మువ్వల సవ్వడి విని నిన్ను వెతుకుతూ నే వస్తే నీ నుండి రాలి పడిన జాజి పువ్వులు , నీ లేత పాదాలను ముద్దాడిన యీ  పచ్చిక బయళ్ళు ఈ దారి వెంటే నీవు నడిచి వెళ్ళావని చెప్పకనే చెబుతున్నాయి.
       నీవు నడిచి వెళ్ళిన దారంతా  రాలిపడిన యీ పొగడపువ్వులు,నిన్ను తాకి వింత కాంతితో మరింత అందంగా మెరిసిపోతున్న యీ వెండి వెన్నెల నీ స్పర్శతో పులకరించిపోతూ ఈ దారి వెంటే నీవు నడిచి వెళ్ళావని చెప్పకనే చెబుతున్నాయి.
      కురుస్తున్న ఈ  వెన్నెల వానలో పురి విప్పి నాట్యమాడిన మయూరి,ఎల్లప్పుడూ నిన్నంటి వుండే ఈ చందన పరిమళం నీవెంతో దూరంలో లేవని చెప్పకనే చెబుతున్నాయి.
      గలగలా పారె సెలయేటి సవ్వడి నీ నవ్వులా అనిపించి,ఒక్క క్షణం నే పొరబడి, నిన్ను చేరుకోవాలన్న ఆత్రంలో నా అడుగులు తడబడి నీకై వెతికి వెతికి  ,నీవు కానరాక.....బరువెక్కిన మనసుతో కనురెప్పల తెరచాటు నుండి కారి,జారిపోతున్న కన్నీటితో వెనుతిరిగి వస్తుంటే .....దూరంగా వినిపించిన నీ మధుర వేణుగానంతో నే తుళ్ళిపడి చుట్టూ చూసేసరికి పారిజాతపు చెట్టు కొమ్మపై పవళించి  నీ తియ్యని మురళిగానంకై వేచి ఉన్న నా కంటికి అస్పష్టంగా కనిపిస్తున్న నిన్ను చేరుకోవాలని వడివడిగా  నీ చెంతకు వచ్చిన  నన్ను నీ చిలిపి నవ్వు ప్రేమగా  పలకరిస్తుంటే  సిగ్గుతో  బరువుగా వాలిపోతున్న నా కనురెప్పలు నిన్ను  చూడనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.
   ఊహలు ఊసులై నిన్ను పలకరించేలోపు సిగ్గుతో మూగపోయిన  నా పెదవులు  నా మనసు పంపే సందేశాన్ని నీకు చేరనివ్వకుండా అడ్డుపడుతున్నాయి.
    నిన్ను చేరాలని నా మనసు పడే ఆరాటాన్ని సిగ్గుతో తడబడుతున్న నా అడుగులు  నీ దరి చేరనివ్వకుండా  ఆపేస్తున్నాయి.
     మౌనంగా  నా మనస్సు పంపిన సందేశం నీ  మనస్సుకి చేరిందని , ప్రేమగా చూసే నీ చూపులు, నీ చిరునవ్వు ఎప్పటికీ  యిక నా సొంతమని  నాకు చెప్పకనే చెబుతున్నాయి.
     ఈ క్షణం యిక్కడే ఆగిపోని... నా జీవితం యిలానే సాగిపోని... నీ ప్రేమలో నన్ను మైమరచిపోని .


Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే