కురిసింది వాన...

      

      తొలకరి చినుకులలో తడిసిన మట్టి వాసనతో కలిసిన చల్లటి గాలి నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా నెమ్మదిగా తాకుతూ ముందుకు సాగిపోతోంది. కురుస్తున్న  వర్షాన్ని చూస్తూ ఆలోచనాల్లోకి జారుకున్నా.
       చిన్నప్పుడు వాన  కురుస్తుంటే  ఆ వానలో నేను  తడుస్తూ ఆడుకుంటూ అక్కడక్కడా నిలిచిన నీటి గుంటలలో ఎగిరి దూకుతూ  ఆడుకున్నంతసేపు ఆడుకుని అలానే వర్షంలో  పూర్తిగా తడిసిపోయి  యింటికి వచ్చినందుకు అమ్మ తివాట్లు పెడుతూ నాకు  జలుబు చేస్తుందేమో అని గబ గబా తలారబెట్టి నాకు పెద్ద గ్లాసుడు మీగడ  పాలు యిచ్చి, నిప్పుల కుంపటి మీద లేత మొక్కజొన్న పొత్తులు విసనకర్రతో విసురుతూ కాలుస్తూ ఉండేది. అమ్మ పక్కనే కూర్చుని చూస్తున్న నేను గబ గబా పాలు తాగేసి కండే గింజల కోసం చేయీ చాస్తే... అమ్మ నవ్వుకుని  నా కోసం లేత కండే  వెతికి గింజలు వలిచి వేడిగా ఉన్నాయంటూ ఊదుతూ నా చేతిలో పెడుతు వుండేది. సాయంకాలం నాన్న ఆఫీస్ నుండి వస్తూ వస్తూ సందు చివర బుజ్జిగాడి కోట్లో కట్టించుకుని వచ్చే  వేడి, వేడి పచ్చిమిరపకాయ బజ్జిలు, పునుగులు ఉల్లిపాయ చట్నీ చూస్తూ నోరూరిపోయి ఎవరూ లేకుండా చూసి  నన్నంతలా ఊరించేస్తున్న పచ్చిమిరపకాయ బజ్జిని కసుక్కున కొరికి ఆ కారానికి కళ్ళంబడా, ముక్కంబడా  నీళ్లు కారిపోతుంటే  ఊరు వాడ ఏకం అయిపోయేలా  నేను  అరిచి గగ్గోలు చేస్తూ ఉంటే పరుగు పరుగున అమ్మ వంటింట్లో  చక్కెర డబ్బాలో నుండి గుప్పెడు చక్కెర తీసుకు వచ్చి  నా నోట్లో పోసి  అంత కారం బజ్జి తిన్నందుకు చిరు కోపంతో  నా  నెత్తిన చిన్నగా మొట్టి,అంతలోనే దగ్గరకి తీసుకుని ముద్దు చేస్తూ కళ్ళు తుడుచుకుంటున్న అమ్మని చూసి నాన్న ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే అది చూసి అమ్మ ఒక్క క్షణం నాన్న వంక కోపంగా చూసి అంతలోనే తడిసిన కళ్ళతోనే నవ్వులు కురిపిస్తుంటే , కారం తిన్నది నేనైతే అమ్మ కళ్ళలో కన్నీరు ఎందుకు వచ్చాయో ,అది చూసి నాన్నకి నవ్వు ఎందుకు వచ్చేదో...నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు.ఇప్పుడు అర్థం అయ్యి అమ్మ పిచ్చి ప్రేమకి నవ్వు వస్తుంది.
   మళ్ళీ వెళ్ళి నేను  వర్షంలో ఆడుకోవటానికి నాన్న ఒప్పుకున్నా ,మీకెమీ తెలీదు మీరు ఉరుకోండి అని అంటూ అమ్మ నాన్నని గదామయించేస్తూ  బయటకి వెళ్ళి ఆడుకుంటానన్న నన్ను ఆపే ప్రయత్నం చేస్తూ "మనం యిద్దరం అడుకుందాం రా చిట్టి తల్లి .." అని అంటూ కాగితపు  పడవలు చేసి నాకు యిస్తూ ఉంటే నేను మా  యింటి సావిట్లో చూరు మీద నుండి ధారగా కారుతూ చిన్న ప్రవాహంలా పారుతున్న నీళ్ళల్లో ఆ పడవలు వేసి అవి మునుగుతూ,తేలుతూ ఒక దాని వెనుక ఒకటి... అలా కొట్టుకుపోతూ  వుంటే, నేను ఆనందంగా చప్పట్లు కొడుతూ వాటి మధ్య పోటీ పెట్టి  చూస్తూ అంతటితో వూరుకోకుండా  ఎక్కడో ఉన్న నాన్నని కూడా  చేయీ పట్టుకుని  లాక్కువచ్చి మరీ  చూపించేదాన్ని.వాటిని  చూస్తూ అమ్మనాన్నలూ కూడా కాసేపు చిన్న పిల్లలుగా మారిపోయి  నాతో పాటు వాళ్ళు కూడా  కాగితం పడవలు నీటిలోకి వదులుతూ ఆడుతూ నవ్వుకునేవాళ్ళు.వర్షము వెలిసిన తరువాత అమ్మతో పాటు నేను మా పెరటిలోకి వెళ్ళి వర్షానికి తడిసి అప్పుడప్పుడే మెల్లి మెల్లిగా విచ్చుకుంటున్న జాజి మొగ్గలతో పెరడంతా సువాసన  వస్తుంటే నేను చెట్టు ఆకులని అటు యిటు ఆడిస్తూ వాటి మీద నిలచిన వాన చినుకులు చింది  నా మొహం మీద పడుతూ  నేనాడుకుంటూ  ఉంటే , నా పక్కనే ఉన్న అమ్మ జాజి మొగ్గలు కోసి  తన పమిట కొంగులో వేసుకుంటూ మధ్య మధ్య  నవ్వుతూ నా వంక మురిపంగా చూస్తూ  మొగ్గలు కోయటం అయిపోయిన తరువాత ఒకచేత్తో నన్ను ,మరొక చేతిలో జాజిమొగ్గలున్న పమిట కొంగుని జాగ్రత్తగా పట్టుకుని లోపలకి వచ్చి వాటిని మాల చేసి నాకెంతో యిష్టం అయిన కృష్ణుడి విగ్రహనికి  వేసి మిగిలిన పువ్వుల మాల నా  చిట్టిజడలో పెట్టి నన్ను ఎత్తుకుని నాన్న దగ్గరకి తీసుకుని వెళ్ళేది. నన్ను చూడగానే  నాన్న ఆప్యాయంగా  చేతులు చాచి నా  బంగారు తల్లి... అంటూ నన్ను ఎత్తుకుని ముద్దు చేసేవారు.ఈలోపు  అమ్మ వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి తీసుకుని వచ్చేది.  నాతో అన్నం తినిపించటానికి నాన్న  ఆడే దొంగాటలో అమ్మ నన్ను ఎత్తుకుని నాతో పాటు నాన్నని అక్కడ యిక్కడా వెతుకుతున్నట్లు నటిస్తూ మధ్య మధ్య ఒక్కో ముద్ద పెడుతూ  నాతో పెరుగన్నం తినిపించేసేది.చీకటి పడిన తరువాత తగ్గినట్లే  తగ్గి మళ్ళీ జోరు వాన  పడుతుంటే  ఆకాశంలో   మెరిసె మెరుపులు,ఉరిమె ఉరుములు చూసి నేను  భయపడిపోతుంటే నాన్న నన్ను ఎత్తుకుని "బజ్జోరా... చిట్టి తల్లీ" అంటూ భుజాన వేసుకుని జో... కొడుతూ వుంటే  నా రెండు చేతులతో నాన్న మెడని గట్టిగా హత్తుకుని అలానే  నిద్రపోయేదాన్ని.మధ్య మధ్యలో మెలకువ వచ్చిన నేను చీకటిలో  గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్టు ఆకులు చూసి  బుచాడు అని అనుకుని   భయపడిపోయి నాన్న  గుండెల మీదకి చేరిపోయి నాన్నని గట్టిగా పట్టుకుని   నాన్న చెప్పే కబుర్లు వింటూ నాన్న రెండుచేతుల మధ్య వెచ్చగా  మళ్ళీ నిద్రలోకి జారుకునేదాన్ని.
     అమ్మా.... వాన పడుతోంది,ఆడుకుందాం రా...అని అంటూ నా చిట్టితల్లి  నా వెనుక నుండి వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి  నన్ను  హత్తుకుని ఊగుతూ గారాం చేస్తూ ఆడిగేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చిన్ననాటి జ్ఞాపకాలనుండి బయట పడిన నేను   నవ్వుకుంటూ  నా చిట్టితల్లిని దగ్గరకి తీసుకుని ముద్దు చేస్తూ  ఎత్తుకుని అప్పుడే మమ్మల్ని  వెతుక్కుంటూ వస్తున్న  ఈయన చేయీ పట్టుకుని కాగితం పడవల పోటీకి బాల్కనీలోకి పరుగు తీసా.
   


Comments

  1. very touching blog sandhya. Really while reading through literally i visualized my childhood.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే