ఈ పాపం ఎవరిది...?

        నేనింకా మరచిపోలేదు ఆ సంఘటన. ఆ రోజు పొద్దున్న నేను వంట చేస్తున్నప్పుడు  కాకులన్నీ కావు...కావుమని అరుస్తుంటే ఏం జరిగిందో చూద్దామని గబగబా బాల్కనీలోకి వెళ్ళి చూశా. ఎదురింటి మామిడి చెట్టు మీద నుండి యింకా రెక్కలు పూర్తిగా రాని కాకి పిల్ల ఎలా పడిపోయిందో తెలియదు కాని గూడు నుండి జారి కింద పడిపోయింది.అది ఎగరటానికి ప్రయత్నిస్తూ పూర్తిగా రెక్కలు రాకపోవటం వల్ల ఎగరలేక ఆ కాకిపిల్ల  పడే అవస్థ చూసి మిగతా కాకులన్నీ చేరి గోల గోలగా అరవటం మొదలుపెట్టాయి.పాపం అక్కడే ఉన్న తల్లికాకి దాన్ని మళ్ళీ ఎలా అయినా గూడుకి చేర్చాలని ప్రయత్నిస్తూ ఆ కాకిపిల్ల  చుట్టూ అక్కడక్కడే ఎగురుతూ అది పడే ఆరాటం చూస్తూ ఉంటే నాకు చాలా జాలి  వేసి సాయం చేయటానికి దగ్గరకి వెళ్ళబోతే  తల్లికాకి కంగారు పడి నన్ను కాకిపిల్ల దగ్గరకి  వెళ్ళనివ్వకుండా నా మీద దాడి చేసేసరికి, నేను భయపడిపోయి ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వచ్చేశా. తల్లికాకి నెమ్మది నెమ్మదిగా కాకిపిల్లని కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు కిందకి చేర్చి దానికి అనుక్షణం కాపలా కాస్తూ మధ్య మధ్య మా అపార్టుమెంటు వాళ్ళు జాలి పడి పెడుతున్న తిండి కాకిపిల్ల నోటికందిస్తూ ఉండేది.ఆ సాయంకాలము స్కూలు నుండి వచ్చిన మా అమ్మాయి యిదంతా చూసి జాలి పడి రెక్కలొచ్చేవరకు ఆ కాకి పిల్లని ఇంట్లో ఉంచుకుందామని ఎంతో  జాలిగా నన్ను బ్రతిమలాడింది.అప్పటిదాకా      నాకు రాని ఆలోచన దానికి వచ్చినందుకు సిగ్గు పడి నేను ఒప్పుకునేలోపు మా అపార్టుమెంటు వాళ్ళతో పాటు మా యింట్లో వాళ్ళు కూడా "కాకి శనీశ్వరుడి వాహనం.కాకిని అలా తీసుకుని రావటం యింటికి మంచిది కాదు ..." అని అడ్డు చెప్పేసరికి ఏమి చేయలేక చూస్తూ ఉండి పోయా.కానీ ఆరోజు నుండి ఆ కాకిపిల్లని నేను మధ్య మధ్య వెళ్ళి చూసి వస్తూ తిండి పెడుతూ ఉండేసరికి మొదట అంతగా గొడవ చేసిన తల్లి కాకి మెల్లిమెల్లిగా మా ప్రయత్నం అర్థం చేసుకున్నట్లుగా మమ్మల్ని అడ్డుకునేది కాదు.ఆ రెండు కాకులు ఎంతగా అలవాటు పడిపోయాయి అంటే మా అమ్మాయి  ఏం తింటున్నా అది తీసుకెళ్ళి వాటికి పెట్టి వచ్చేది.యిలా వారం రోజులు గడిచిపోయాయి.మేము అందరం ఆ కాకిపిల్ల ఎప్పుడెప్పుడు ఎగురుతుందా అని చూస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒక రోజు మధ్యహం నేను కునికిపాట్లు పడుతుంటే ఒక్కసారిగా కాకులన్నీ గోలగోలగా  అరుస్తుండేసరికి ఉలిక్కిపడి నిద్ర లేచి పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి ఎక్కడినుండి వచ్చిందో ఒక నల్ల కుక్క ఎలా పసిగట్టిందో తెలియదు కాని కారు కింద ఉన్న కాకిపిల్లని నోటా కరుచుకుని అక్కడి నుండి పరుగు తీసింది. ఆ కుక్కని చుట్టుముట్టి ఆ కాకిపిల్లని తప్పించాలని తల్లి కాకి పడే ఆరాటం,మిగతా కాకుల తాపత్రయం చూస్తూ నేను   నిస్సహాయంగా నిలబడిపోయాను.ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో మీకు ఈపాటికి అర్థం అయ్యే ఉంటుంది.ఆ  క్షణం నా మీద నాకే అసహ్యం వేసింది.ఎవరో అది శనీశ్వరుడి వాహనం,దాన్ని అంటరాదని అంటే  ఆ  మాటలు విని నేను తప్పు చేశానని చాలా బాధ వేసింది.ఎప్పటిలా ఆ రోజు సాయంకాలం స్కూలు నుండి వచ్చిన నా కూతురు వచ్చి రాగానే దానికి నేను యిచ్చిన బిస్కెట్లు కాకులకి పెట్టటానికి కార్ పార్కింగ్ దగ్గరకి వెళ్ళి అవి కనిపించక కంగారు పడి అటుయిటు వెతుకుతూ ఉండేసరికి, యిదంతా చూస్తున్న నేను దానికి నిజం చెప్పి బాధ పెట్టలేక కాకి పిల్లకి రెక్కలొచ్చి చెట్టు మీదకి ఎగిరిపోయిందని అబద్ధం చెప్పా.అది విని నా కూతురు ఆ కాకులు మళ్ళీ కనిపించవని దిగులు పడినా అంతలొనే చెట్టు మీద వున్న  వాళ్ళ అమ్మ దగ్గరకి కాకిపిల్ల చేరిపోయిందని చాలా సంతోషించి ఆడుకోవటానికి వెళ్ళిపోయింది.కానీ యిది జరిగిన కొన్ని రోజుల వరకు రోజూ పొద్దున్నే తల్లి కాకి వచ్చి ఎక్కడైతే కాకిపిల్ల దాక్కుని ఉండేదో అక్కడికి వచ్చి దాని కోసం వెతుక్కుంటూనే వుండేది. యిది చూస్తున్న నేను తట్టుకోలేక ఎన్నిసార్లు దాన్ని తరిమినా అది మళ్ళి మళ్ళీ తిరిగొచ్చి నా వంక చూస్తూ దీనంగా అరుస్తూ ఉండేది.చివరికి దాని బాధ చూసి తట్టుకోలేక నేను కొన్నాళ్ళు మా ఊరికి వెళ్ళిపోయీ పది రోజుల తరువాత వచ్చా. అర్థం చేసుకుందో ఏమొ మళ్ళీ నాకెప్పుడు ఆ  తల్లి కాకి కనిపించలేదు.
    యిప్పుడు చెప్పండి.ఈ పాపం ఎవరిది.? కాకిలా పుట్టడం దాని పాపమా...?,
అర్థం లేని శాస్రాలు చెప్పి నన్నుఅడ్డుకున్న మనుష్యులదా ...?,
వాళ్ళ మాటలు విని  తప్పు చేసిన నాదా...?.
   ఒక మాట.... పితృదేవతల రూపంలా భావించి రోజూ కాకికి అన్నం ముద్ద పెట్టే మనం శాస్రాలు చెప్పేటప్పుడు ఈ విషయం ఎందుకు  మరిచిపోతాం?.

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

అమ్మ చేతి ముద్ద

My morning run

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే