మా అమ్మమ్మ ఊరు... సంక్రాంతి పండుగ.

    జనాన్ని తోసుకుంటూ ఎలాగో అలా కష్టపడి బస్ ఎక్కి ఆఖరి వరుసలో ఉన్న సీట్ సంపాదించి కూర్చున్నానో లేదో బస్సు బయలుదేరింది. రాత్రి కురిసిన మంచుతో తడిసిన పచ్చని పొలాలు అప్పుడప్పుడే తొంగి చూస్తున్న సూర్యుని కిరణాలు పడి వింత కాంతితో మెరిసిపోతూ ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. నా ఆలోచనలు గతంలోకి   పరుగులు తీయటం మొదలు పెట్టాయి.
      సంక్రాంతి  పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి బస్సులో వెళ్తుంటే దారి పొడవునా పచ్చటి పొలాలు , ఎడ్లబండ్ల మీద చెరుకు తీసుకెళ్తున్న రైతులు ఎదురుపడేవారు.ఊరు దగ్గర పడుతోందనటానికి గుర్తుగా రోడ్డు పక్కనే ఉన్న అంబేత్కర్, గాంధీ తాత,సుభాష్ చంద్ర బోస్ నాయకుల విగ్రహాలు కనిపిస్తూ ఉండేవి.అవి దాటిన తరువాత అమ్మ చదువుకున్న గవర్నమెంటు స్కూల్ యిప్పటికీ  చెక్కు చెదరకుండా అలానే ఉంది.రాజు గారి కోట దగ్గర బస్సు ఆగగానే ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మయ్యలు ఎదురొచ్చి చేతిలో లగేజీ తీసుకుని అమ్మమ్మ యింటికి తీసుకుని వెళ్తుంటే దారిలో కనిపించే చిన్న గుడి భ్రమరాంబ తల్లి,పెద్ద గుడి వేణుగోపాల స్వామికి గుడి బయట నుండే దణ్ణం పెట్టుకుని ,ఆప్యాయంగా పలకరిస్తున్న ఊరి జనం కుశలప్రశ్నలకి బదులిస్తూ యింటికి వెళ్ళే వాళ్ళం.అప్పటికే మా కంటే ముందుగా వచ్చేసిన  పెద్దమ్మ,మమయ్యాలు,పిన్ని కుటుంబాలతో అమ్మమ్మ  ఇల్లు పండుగ సందడితో కలకళలాడిపోతూ ఉండేది.
     సంక్రాంతి పండుగ అంటే  నాకు ఊహ తెలిసినప్పటినుండి అంత చలిలో కూడా పొద్దున్నేనిద్ర లేచి అమ్మ,అమ్ముమ్మ,పెద్దమ్మ, అత్తయ్యలు పోటీలు పడి వేసే రకరకాల  రంగవల్లులు, వాటి మధ్య అందంగా  అలంకరించె గొబ్బెమ్మలు.
మమయ్యాలు  వేసే భోగిమంటలు.
తెలతెల్లవారక ముందే యింటింటికి హరినామస్మరణ చేసుకుంటూ వచ్చే హరిదాసులు.
పొద్దు గడిచాక వచ్చే గంగిరెద్దుల మేళం. పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లల గొబ్బి పేరంటాలు. యింటింటా ముచ్చటగోలుపుతూ  రంగురంగుల   బొమ్మలకొలువులు.
భోగి రోజున చిన్న పిల్లకందరికి  దిష్టి తీసి పెద్దవాళ్ళు పోసిన భోగిపళ్ళు.
ఆ భోగి పళ్ళల్లో చిల్లరపైసల కోసం చిన్న పిల్లల  చిలిపి తగాదాలు...
సంక్రాంతికి ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్న అరిసెలు,జంతికలు .
పండుగ రోజున యింటింటికీ వచ్చి తిధి,వారం, వర్జం చెబుతూ  ఆశీర్వచనం యిచ్చి దక్షిణ స్వీకరించే వేద బ్రాహ్మణులు.
పండగకి పసుపు,కుంకుమ పంచుకునే ముతైదువులు.
మాన్యాదారాల గాలిపటాలు ఎగరేసే కుర్రకారులు.
కోడిపందాలతో పంతాలకి పోయి పందేలు వేసుకుంటూ సందడి చేసే ఊరి జనం.
కాఫీల మీద కాఫీలు లాగించేస్తూ ,గుప్పు గుప్పున రైలు ఇంజిన్ పొగలా సిగరెట్టు పొగని వదిలేస్తూ నాలుగు ముక్కలాట ఆడేసే మా  యింటి బంధువులు.
దాగుడుమూతలు, దొంగ పోలీసు,అష్టాచెమ్మ యిలా రకరకాల ఆటలాడేసుకునే పిల్లలు.
క్యారంబోర్డు ఆటలో నువ్వా...నేనా అన్నట్లుగా పౌరుషాలకి పోయీ పోటీలు పడి ఆడే పెద్ద నాన్న,నాన్న,మమయ్యాలు.
పండగకి అత్తారింటికి వచ్చి  అతిధిమర్యాదలతో ఉబ్బితబ్బిబయ్యే కొత్త అల్లుళ్లు,వాళ్ళని  చనువుగా ఆట పట్టిస్తూ అల్లరి చేసే మరదలు పిల్లలు.
పండుగ రోజు పొంగించిన పాలతో చేసే అన్నపరవాన్నం.
కనుము రోజున ఎడ్లని అందంగా అలంకరించి పొలం పనిముట్లకి పూజ చేసే రైతన్నలు.
పండుగ మూడు రోజులు ఊరంతా ...
భోగిపళ్ళు,స్వర్గపు వాకిళ్ళు,రథం ముగ్గులతో నిండిపోయే వాకిళ్ళు.యిలా ఊరు ఊరంతా ఏకమై సందడి చేసే సంక్రాంతి పండుగ.
    "ఒరేయ్  ఊరు వచ్చేసింది .బస్సు బయలుదేరిపోతోంది.త్వరగా దిగు.." అని నా స్నేహితుడు భుజం మీద తడుతూ నన్ను పిలిచేసరికి ఉలిక్కి పడిన నేను బుజంపైనుండి జారిపోతున్న బాగ్ ని వెనక్కి తోసుకుంటూ హడావిడిగా బస్సు దిగి  స్నేహితుడితో కలసి నడుస్తూ మళ్ళీ మావాళ్ళందరిని ఎప్పటికి కలుసుకుంటానో అని ఆలోచిస్తూ దిగాలుగా హాస్టల్ వైపు అడుగులేశాను. 
      
   
 

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

అమ్మ చేతి ముద్ద

My morning run

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే