ఉ(మెన్స్) డే

        ఐదింటికే నిద్ర  లేచిన నేను వారం రోజులుగా పని మనిషి రాకపోవటంతో యింటి పని,వంట పని చేసేస్తూ  పిల్లలకి లంచ్ బాక్స్ రెడి  చేసేసినా ఎప్పటిలానే తాపీగా రెడి అయిన పిల్లలిద్దరిని స్కూలుకి ఆలస్యం అయిపోతోందంటూ తిడుతూ యింత గోడవలోను ముసుగు తన్ని ప్రశాంతంగా నిద్ర పోతున్న శ్రీవారిని చూసి సైలెంట్ గా పళ్ళు పటపటలాండించేస్తూ  అంతలోనే ఈయన  క్యాంప్ నుండి అర్థరాత్రి ఇల్లు చేరిన విషయం గుర్తుకొచ్చి నాలిక కొరుక్కుని హడావిడిగా పిల్లలిద్దరిని తీసుకుని నా పెళ్ళికి ముందే మా పుట్టింటివాళ్ళు కొనిచ్చిన స్కూటీ ఎంతకీ స్టార్ట్ అవ్వక మొరాయిస్తుంటే దాన్ని ఎలాగో అలా తంటాలు పడి స్టార్ట్ చేసి వెళ్తుంటే దారిలో   నా స్కూటీ చేసే చిత్రవిచిత్రమైన శబ్దాలకి నిద్రాభంగం అయిన కుక్క ఒకటి మీదకి ఉరుకుదామని చేసిన ప్రయత్నంలో నేను ఆ  కుక్కని గుద్దబోయీ, దాని నుండి తప్పించి ఎప్పుడో కురిసిన వర్షాలకి పడిన గుంటలో పడబోయీ నిభాయించుకుని బండిని ముందుకు పరుగు తీయించాను. అప్పటికే  బయలుదేరిపోయిన బస్సుని కొంత దూరం వెంటాడి, బస్సు డ్రైవర్, కండక్టర్లతో ఆలస్యంగా వచ్చినందుకు తివాట్లు తిని పిల్లలిద్దరిని బస్సు ఎక్కించేసి హమ్మయ్య అనుకుంటూ ఈ హడావిడికి గుండె హడావిడిగా కొట్టేసుకుంటూ ఉంటే దాన్ని శాంతపరచాలని  స్కూటీని స్టార్ట్ చేసి నెమ్మదిగా ప్రకృతి అందాలు చూసుకుంటూ తాపీగా నా మానాన నేను డ్రైవ్ చేసుకుని రోడ్డు పక్కగా  వస్తుంటే వెనుక నుండి వచ్చిన కారు వాడు విసురుగా నన్ను దాటుకుంటూ ముందువెళ్తూ... "ఏవమ్మా..నీకు డ్రైవింగ్ నేర్చుకోవటానికి ఈ రోడ్డే దొరికిందా ?"అని నన్ను తిట్టేస్తూ ముందువెళ్లిపోయాడు.వాడు నన్నే అన్నాడని అర్థం చేసుకుని నేను రియాక్ట్ అయ్యేలోపు మెరుపువేగంతో మాయమైపోయాడు. ఊహించని యీ సంఘటనకి చుట్టూ పక్కల వాళ్ళు చూసే చూపులకి  అవమానంగా ఫీల్ అయిపోతూ నేను స్పీడుగా బండి డ్రైవ్ చేసుకుంటూ యింటికి వచ్చిపడ్డాను.నేను అంత  స్పీడుగా  రావటం చూసిన మా శ్రీవారు "ఎందుకోయ్ అంత స్పీడు,నిదానంగా రావచ్చు కదా" అని అనేసరికి అప్పటిదాకా ఆయాసంతో దబదబా కొట్టుకుంటున్న గుండె ఆవేశంతో యింకొంచెం వేగంగా కొట్టుకోసాగింది.నే నోరు తెరిచి జరిగిన విషయం చెప్పేలోపు  "అన్నట్లు చెప్పటం మరిచిపోయా...హ్యాపీ ఉమేన్స్ డే నౌ.ఈ సందర్భంగా నీకు ఏమి కావాలో అడుగు",అని ఈయన  విష్ చేసేసరికి అరె... ఈ రోజు మా రోజు అన్న మాట.ఈ విషయం నాకు గుర్తే లేదే ,ఈ రోజు ఎంచక్కా హోటలుకి లంచ్ కి తీసుకుని వెళ్ళమని అడుగుదాం  అని నాలో నేను అనుకుంటూ  కాఫీ గ్లాసు ఈయన చేతికి అందించేలోపు "ఏమోయ్...వారం రోజులుగా హోటలు ఫుడ్ తిని తిని విసుగొచ్చింది.నీ చేత్తో చేసిన వంట తినాలని ఉందోయ్. మామిడికాయ పప్పు,గుత్తి వంకాయ కూర,రసం పెట్టు చాలు .అన్నట్లు మళ్ళీ రాత్రికి ఏం వండుతావులే గానీ...అని గ్యాప్ యిచ్చేసరికి రాత్రికి హోటలుకి తీసుకునివెళ్తారన్న మాట అని నా మనస్సు ఆనందంతో పిల్లిమొగ్గలు వేసేయబోతూ వుంటే "టమాటో పచ్చడి, కంది పొడి చేసేయవోయ్. రాత్రి పూటా వేడి  వేడి అన్నంలో కందిపొడి కలుపుకుని తింటూ ఉంటే కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుందనుకో" అని నా ఫీలింగ్స్ తో పని లేకుండా తన మానాన తను చెప్పుకెళ్లిపోతుంటే ఈ రోజు అస్సలు ఉమేన్స్ డే నా...ఎప్పటిలా మేన్స్ డే నా అని డౌబ్ట్ వచ్చింది.కానీ పొద్దున్నుండి విష్ చేస్తూ వాట్సాప్ లో వచ్చిన సందేశాలు ఈ రోజు ఉ మేన్స్ డే అని పదేపదే చెబుతున్నాయి.యిదేమిటండీ...యిదేమీ ఆన్యాయం అని అడిగితే  "ఈ రోజు మేన్స్ డే కూడా.నువ్వే చూడు.ఉమెన్ లో మెన్ కూడా ఉన్నాడు కదా..."అని నవ్వుకుంటూ అక్కడినుండి వెళ్లిపోయారు. ఈయన చెప్పిన లాజిక్ కి నేను  అలా తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయా.ఈలోపు ఫోన్ రింగ్ అయితే వెళ్ళి మాట్లాడేసరికి అవతల నుండి నా చిన్ననాటి నేస్తం,"ఏమే...ఈ రోజు ఉమేన్స్ డే కదా...ఏంటి స్పెషల్స్?" అని ఆడిగేసరికి అప్పటిదాకా ఎలాగో అలా అపుకున్న కోపం అంతా దాని మీద చూపించేస్తూ దాన్ని ఎందుకు తిడుతున్నానో అది  అర్థం చేసుకునేలోపు ఛడమాడా తిట్టేసి ఫోన్ పెట్టేశా. ఆవేశం తగ్గిన తరువాత దాని మీద తెగ జాలి వేసేసింది.అత్త మీద కోపం దుత్త మీద చూపించటం అంటే యిదేనేమో.మరి ఉంటానండి.ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
  అన్నట్లు మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
 

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే