సీతారాముల కళ్యాణం ...చూతము రారండి

    శ్రీరామనవమి అంటే మా చిన్నప్పుడు బీసెంట్ రోడ్డులో తాటాకులతో వేసే చలువ పందిళ్ళు పగలంతా షాపింగ్ చేసుకునే వాళ్ళకి హాయి గోలుపుతూ ఉంటే అవే పందిళ్ళు రంగు రంగుల బల్బులతో రాత్రిపూట మరింత అందంగా ప్రకాశిస్తూ ఉండేవి. వాటిని చూడటానికి షాపింగ్ చేయటానికి వచ్చే పోయే జనం బీసెంట్ రోడ్డు మధ్యలో అందంగా  అలంకరించబడిన  సీతారాముల గుడిని  దర్శించుకుని వడపప్పు పానకం ప్రసాదాలు తీసుకుని నాలుగు అడుగులు ముందుకు వేసి దాహం వేస్తోందన్న  మిషతో పనిగట్టుకొని  సందులోకి  వెళ్ళి పుష్పాల రంగయ్య షాపులో గోళి సోడా  తాగేసి తృప్తిగా త్రెంచేసి మరొక్క రెండు అడుగులు  బీసెంట్ రోడ్డు వైపు వేసి  ఒక చేతిలో డబ్బులు పెట్టగానే మరో చేయెత్తి దీవించే బొజ్జ వినాయడుకి విగ్రహం వద్ద   క్యూలో నిలబడి మరీ స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని సాక్షాత్తు ఆ వినాయకుడే ఆశీర్వదించినంతగా ఫీల్ అయిపోతూ నడుచుకుని ముందుకు వస్తుంటే  అక్కడకి రాగానే గుప్పుమని వచ్చే చేపల మార్కెట్ వాసనలతో దాదాపు రోడ్డు చివరకి వచ్చేసాం అని గుర్తుకి రాగానే  ఖచ్చితంగా యిక్కడే ఉండాలే అని ఆత్రంగా వెతికేలోపు యిదిగో యిక్కడున్నా అన్నట్లుగా రోడ్డు పక్కగా ఉన్న  చిన్న గుడిలో బొజ్జ వినాయకుడు ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాడు. బీసేంట్ రోడ్డు ప్రజలందరికీ సెంటిమెంట్ దేవుడివి నువ్వు..నన్ను కూడా చల్లగా చూడు తండ్రి అని మనసారా దణ్ణం పెట్టుకుని  అలా రోడ్డు చివరికి రాగానే రోడ్డుకి అటు యిటు వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జిలు, పునుగులు,వడలు, నోరూరిస్తున్నట్లుగా ఉన్న పచ్చిమిరపకాయ బజ్జి మసాలా వాసనలతో  అంగళ్ళు  రా...రమ్మని  పిలుస్తుంటే యిక ఆగలేక  వడివడిగా  అటువైపు అడుగులు వేస్తూ వెళ్ళి నోరు కాలిపోతున్నా లెక్క చేయకుండా కారానికి ముక్కంబడా,కళ్ళంబడా నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా  మేము బెజవాడ వారసులం,మా కృష్ణాజిల్లా వాళ్ళకి యిదో లెక్కా...అనుకుంటూ వాటన్నిటినీ ఒక పట్టు పట్టించేసి ,యిన్నీ తిన్నవాళ్ళం ...నిన్ను మాత్రం ఎందుకు వదులుతాం అనుకుంటూ మళ్ళీ బీసెంట్ రోడ్డు దారి పట్టి  దూరం అయితే అయ్యింది, రుచుల విషయంలో రాజీ పడే సమస్యే లేదనుకుంటూ యీ చివరి నుండి  ఆ చివరిదాకా ఎటూ తల తిప్పి చూడకుండా తిన్నగా  వెళ్లి రవీంద్ర కూల్ డ్రింక్స్ షాపులో దూరి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు చల్లగా పొట్టలో వేసుకుని హమ్మయ్య...ఆత్మా రాముడు శాంతించాడు అని అనుకుంటూ   రాములోరికి మరొక్కసారి దణ్ణం పెట్టుకుని తృప్తిగా  యింటికి వెళ్ళేవాళ్ళం.
    ఆగండాగండి...శ్రీరామనవమి అంటే అంతటితో అయిపోయిందనుకున్నారా...ఆ రోజు ఎక్కడ చూసినా సీతారాముల కళ్యాణ మహోత్సవంతో అన్ని గుళ్ళు, గోపురాలు,పందిళ్ళు...ఊరంతా కోలాహలంగా ఉండేది.
ఎక్కడికక్కడ పానకం,వడపప్పు పంచిపెట్టే ఊరి జనం.
మజ్జిగ, మంచినీరు పంచె చలివేంద్రాలు.
చీకటి పడగానే హరికథ, బుర్రకధ కాలక్షేపాలతో  ఆ తొమ్మిది రోజులు ఊరంతా ఒకటే సందడి. యిక చివరి రోజు  సాయంకాలం  స్వామి వారి ఊరేగింపుకి  అందరూ గబ గబా పనులు ముగించేసుకుని గుడి ముందుకు చేరిపోయేవాళ్ళం.కాగడాలు,పెట్రోమాక్స్ లైట్స్ సిద్ధం చేసుకుని రథం మీద కొలువు తీరి వున్న శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవ విగ్రహాలకు  ధూప,దీప నైవేద్యాలు అనంతరం పిల్లా, పెద్ద అందరూ ఏకమై జై శ్రీరామ్...జై జై సీతారాం అంటూ ఎంతో ఉత్సాహంగా రథాన్ని  ముందుకి లాగుతుంటే అడుగడుగునా భక్తులు పువ్వులు,పళ్ళు,టెంకాయలు సమర్పిస్తూ ఉంటే పూజారులు స్వామి వారికి హారతులిస్తూ,భక్తులకు ప్రసాదాలు పంచిపెడుతూ రథయాత్ర ముందుకు  సాగేది.అలా రథాన్ని వీధులన్నీ తిప్పి  అర్థరాత్రికి మళ్ళీ గుడికి చేరుకునేవాళ్ళం.
      మా బెజవాడలో ప్రతి ఏటా యిలా  జరిగే శ్రీరామనవమి ఉత్సవము  కనులారా చూసి తీరాల్సిందే.మరి ఉంటాను. మరోసారి మరో టాపిక్ తో మళ్ళీ కలుస్తాను.

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

అమ్మ చేతి ముద్ద

My morning run

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే