క్షణక్షణముల్ ఆడవాళ్ళ చిత్తముల్...
ప్రేమ,ఆప్యాయత,అనురాగం అనుకుంటూ కూర్చోబట్టి అందరితో నేను యిన్నిన్ని మాటలు పడుతున్నానంటూ ఆవేశంగా మాట్లాడుతూ నా శ్రీమతి నా దగ్గరకి వచ్చేసరికి కంగారు పడిన నేను చదువుతున్న పేపర్ పక్కన పడేసి అసలేమి జరిగిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేలోపు అలా చూస్తూ ఉండకపోతే ఏమి జరిగిందో అడగొచ్చు కదా నా వంక చూస్తూ నిష్ఠురంగా అనేసరికి యిలాంటప్పుడు మాట్లాడితే ఒక తంటా,మాట్లాడకపోయినా మరో తంటా అని నాలో నేను అనుకుంటూ అయినా రోట్లో తల పెట్టిన తరువాత రొకలిపోటుకి వెరవటం ఎందుకని లేని దైర్యం కూడగట్టుకొని అసలేమి జరిగింది బంగారం.... అని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ అనేసరికి అసలు యిదంతా మీ వలనే అంటూ రివర్స్ గేర్ లో తిట్ల డైరెక్షన్ నావైపు గురి పెట్టింది.ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే యిదే కాబోలు అని నాలో నేను అనుకుంటూ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు మీరు మధ్యలో మాట్లాడకండి,యిదంతా మీవల్లే ... అందుకే అంటారు పుణ్యం కొద్ది పురుషుడు,దానం కొద్ది బిడ్డలు అని.. ఆయినా మా వాళ్ళు పెళ్లి చూపుల రోజే చెప్పారు తొందర పడకు ఒక్క వారం రోజు ఆగు. ఢిల్లీ కుర్రాడు కూడా నిన్ను చూసుకోవటానికి వస్తున్నాడు.ఆ సంబంధం కూడా చూసి అప్పుడు నిర్ణయించుకో అని. నే వింటేగా...నాలుగు మాటలు మంచిగా మాట్లాడేసరికి మీ మాయలో పడి పోయి మీ సంబందం ఒప్పేసుకున్నా అంటూ నన్ను సాధించేస్తూ ఉంటే ,అరె... ఈ విషయం తెలియక అనవసరంగా నేను తొందరపడి నా గొయ్యి నేనే తవ్వుకున్నానన్న మాట అని ఒక్కక్షణం నా మీద నాకే విపరీతమైన జాలి వేసింది. " ఓరి ఢిల్లీ పెళ్ళికొడకా... ఎంతపని చేశావురా.నువ్వు తెలివిగా తప్పించుకున్నావ్, అమాయకంగా నేనిరుక్కుపోయా అని మనస్సులో వాడిని తిట్టుకుంటూ , ఆ సంబంధమే చేసుకుని ఉండాల్సింది,ఎంచక్కా రోజూ రొట్టెలు వత్తుకుంటూ ఉండేదానివి,నాకు ఈ తిట్లు, చివాట్లు తప్పేవి అని నాలో నేను గొణుక్కుంటూ యిక ఈ రోజుకి యింతే సంగతులు,నా మోహన కాఫీ చుక్క పోయదన్న సంగతి తెలిసిపోయి ఈ పూటకి నా కాఫీ నేనే కలుపుకుందామని సైలెంట్ గా వంటింట్లోకి వెళ్ళి నానా తిప్పలు పడి ఎలాగో అలా కాఫీ కలిపేసి నేనొక్కడినే తాగితే మళ్ళీ దానికోక రాద్ధాంతం చేస్తుందని తెలిసి తనకి కూడా కాఫీ గ్లాసు అందించేసరికి యింకొంచెం షుగర్ వేస్తే బాగుండేది అని అనుకుంటూ నా శ్రీమతి కాఫీ అంతు చూడటంలో నిమగ్నమయిపోయింది.యిదే మంచి సమయం అని అనుకుంటూ "అసలేమి జరిగింది బంగారం.." అంటూ ప్రేమగా అడిగా.పొద్దున్న ఏమి తోచక అమ్మకి ఫోన్ చేశానండి. మాటల సందర్భంలో ఉగాది పండుగకి చీర కొనిపెట్టమని నేను అడిగితే మొన్ననే కదా సంక్రాంతికి కొనుక్కున్నావ్ అప్పుడే మళ్ళీ యింకో చీరా... అని మీరు మాట దాట వేసేసారని చెప్పా.అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా..అల్లుడుగారు మంచి పని చేశారు.అయినా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పొద్దస్తమానం ఆ బురఖాలు (మా అమ్మ నైటీలని అలా అంటుందిలెండి),బైటకి వెళ్ళేటప్పుడు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటావుగా.యింక నీకు కొత్త చీరలెందుకు..? యిప్పటికే బీరువా నిండా చీరలున్నాయి కదా అంటూ నన్నే చివాట్లు పెట్టిందండి .అమ్మ కదా అని నా కష్టసుఖాలు చెప్పుకుంటే మిమ్మల్ని వెనకేసుకొచ్చి నన్నే అంటోంది .యిదంతా మీ వల్లే...మీరు చీర కొని ఉంటే నేను అమ్మకి మీ మీద కంప్లైంట్ చేసేదాన్ని కాదు,అమ్మ నన్ను తిట్టేది కాదు అని మరొక్కసారి మరిచిపోయిందనుకున్న పండుగ చీర విషయం గుర్తు చేసుకొని నన్ను దెప్పిపొడుస్తూ అంతలోనే సర్లెండి.. మీతో మాట్లాడుతూ కూర్చుని మీకు యిష్టమని ఈ రోజు పూరీ కూర చేస్తున సంగతే మరిచిపోయా.మీరు స్నానం చేసి పూజ చేసుకుని వచ్చేలోపు టిఫిన్ రెడి చేసేస్తా. మీరు టిఫిన్ తినేసి మా అమ్మకి పూరి కూర యిచ్చేసి రండి.మా అమ్మకి కూడా పూరిలంటే చాలా యిష్టం అని నా శ్రీమతి అనేసరికి యిప్పుడే కదోయ్...నన్ను వెనకేసుకొచ్చిందని మా అత్తగారి మీద సాడిలు చెప్పావు అని నేను ఆశ్చర్యంగా ఆడిగేసరికి మా తల్లికుతుళ్ళు లక్షతొంబై అనుకుంటాం,మళ్ళీ కలుసుకుంటాం.అవి అన్ని మీకెందుకు?. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. నేను టిఫిన్ సంగతి చూస్తాను అని అంటూ నన్ను దబాయించేస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. క్షణ క్షణముల్ ఆడవాళ్ళ చిత్తముల్...ఈ నిమిషానికి ఉన్న మూడ్ మరు నిమిషానికి ఉండదు కదా అని నాలో నేను నవ్వుకుంటూ పక్కన పడేసిన న్యూస్ పేపర్ మళ్ళీ అందుకున్నా.
Comments
Post a Comment