ఆటబొమ్మలు

        ఆకాశంలో  మెరుస్తున్న నక్షత్రాలని చూస్తూవుంటే  పోయినోళ్లు అలా నక్షత్రాలుగా మారిపోతారని చిన్నప్పుడు మా బామ్మ ఎప్పుడూ చెప్పే మాట గుర్తుకువచ్చి  ఏవేవో జ్ఞాపకాలతో  మనస్సు గతం వైపు పరుగులు తీసింది. కొన్ని జ్ఞాపకాలు నిన్న కాక మొన్నే జరిగినట్లుగా అనిపిస్తుంటే  మరికొన్ని జ్ఞాపకాలు లీలగా గుర్తుకొచ్చి రానట్లుగా ఉన్నాయి.కాలగర్భంలో కలిసిపోయిన కొందరి పాత్రలు ఎప్పటికి మరిచిపోలేనంతగా గుర్తుండిపోతే,మరికొందరి పాత్రలు అడుగు పెట్టినప్పటినుండి సందడి చేసేస్తూ అందరిని ఆప్యాయంగా పలకరించేస్తూ అంతలోనే  రసవత్తరంగా ఆడుతున్న నాటకం నుండి ఎవ్వరికీ మాట వరుసకైన చెప్పకుండా అర్థాంతరంగా తమ పాత్ర మధ్యలోనే ముగించేస్తూ నిష్క్రమిస్తే... ఆ బాధని దిగమింగుకుని వాళ్ళని మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ జ్ఞాపకాలు అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నాయి. తొందరపడి నువ్వు వెళ్లిపోయావు కానీ నువ్వుంటె చాలా బాగుండేది అని కొందరితో చెప్పాలనిపిస్తుంది.మరికొందరు చెప్పాపెట్టకుండా హఠాత్తుగా వెళ్లిపోయేసరికి ఉక్రోషంతో పోతే..పో,నాకేంటి...నువ్వు లేకుండా నేనుండలేనా  అని పైకి బింకంగా అన్నా, ఉన్నంతకాలం  నిన్ను,నీ ప్రేమని నేను సరిగ్గా అర్థం చేసుకోలేక నిన్ను బాధ పెట్టనేమో అని మనసులో చాలా బాధ వేస్తూ ఉంటుంది.నీలా ఎవరైనా ఉంటారేమో అని ఎంతో ఆశగా  అందరిలోనూ నిన్ను  వెతుక్కుంటూనే ఉన్నా.
       ఆ దేవుడు సృష్టించిన ఆటబొమ్మలం మనం.ఈ భూమి మీదకి  ప్రాణమున్న  ఆటబొమ్మలుగా వచ్చి మనుషులతో, మనస్సులతో  ఆడుకుని   వెళ్లిపోయే తోలుబొమ్మలం.ఉన్న ఈ నాలుగు రోజుల్లోనే ఎన్నో బంధాలు,బంధుత్వాలు.కొన్ని కొన్ని బంధాలు ఎప్పటికి విడిపోనంతగా గట్టిగా అల్లుకుపోతూవుంటే,మరి కొన్ని బంధాలు అపార్ధాలు,అనుమానాల వల్ల విడిపోతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం. మనవి అని ఆనుకున్నంత కాలం  బంధాలు,బంధుత్వాలు బలంగా  నిలబడతాయి.ఒక్కసారి విడిపోతే ఎంత ప్రయత్నించినా నువ్వెవరో..నేనెవరో అన్నంతగా విడిపోతాయి.అవి చివరివరకు అతకవు.
         చివరిగా ఒక్క మాట.. బంధాలు,బంధుత్వాలు నిలబెట్టుకోవటంలో ఉన్న ఆనందం ఎప్పటికి వదులుకోకండి.ఒక్కసారి మీరు పోగొట్టుకుంటే  తిరిగి రావవి....అది మనుష్యులైనా,మనస్సులైనా.
    
  
    
        
  
     
      

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే