చినుకులా రాలి... నదులుగా సాగి

బాలు... మొట్టమొదటిసారి  నీ గురించి స్వర్గీయ అని రాయటానికి ఎందుకో చేతులు వణుకుతున్నాయి . మనస్సు అంగీకరించటంలేదు.కన్నీటితో నిండిపోయిన నా కళ్ళకి అక్షరాలు అలికేసినట్లుగా కనిపిస్తున్నాయి .గుండె పిండేస్తున్న బాధ.ఈ వార్త నిజం కాకూడదు...కల అని చెప్పు దేవుడా అని వెక్కివెక్కి ఏడవాలనిపిస్తోంది.కానీ యిదే  నిజం అని పదే పదే చెబుతున్న న్యూస్ చానెల్స్.వాట్సాప్ న్యూస్. నమ్మక తప్పని నిజం. 
    అప్పుడే వెళ్లిపోయావా బాలు.ఎందుకంత తొందర.?.యింకొన్నాళ్ళు మాతో ఉంటే బాగుండేది కదా. నీ పాట లేని ఇల్లు ఉంటుందా ఎక్కడైనా?.
  యిన్నాళ్ళు మా మధ్యే ఉంటూ రోజూ నీ పాటతోనే పలకరించే నువ్వు యిక లేవని ఎలా నమ్మమంటావు?. మళ్ళీ త్వరగా వెనక్కి తిరిగి వచ్చేస్తానని మాట యిచ్చి యిలా ఎందుకు చేశావు బాలు..?.మన మధ్య ఉన్న బంధం ఈ నాటిదా..?రోజూ తన పాటతో పలకరించే మా బాలు యిక లేడన్న విషయం ఎలా నమ్మమంటావు?.
    నువ్వు  మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా నీ పాటలు అమరం. అవి ఎప్పటికి మాతోనే ఉంటూ నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి.
నిన్ను తలచుకున్నప్పుడల్లా  ఆ రోజుల నుండి నిన్నటివరకుఎన్నెన్నో జ్ఞాపకాలు.

కుర్రాళ్ళోయ్...కుర్రాళ్ళు... అంటూ యూత్ తో పాటు ముసలివాళ్ళని కూడా నీ పాటతో స్టెప్పులు వేయించినా ,

శంకరా ... నాద శరీరాపరా... ఆని భక్తిభావంలో ముంచినా,

చినుకుల రాలి  నదులుగా సాగి ..... అని డ్యూయెట్ పాడినా, 

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి.. అని నీ పాటతో గోదావరిని అందంగా వర్ణించేసి,
 
మళ్ళీ యింతలొనే ..
ఆవకాయ మన అందరిదీ. గోంగూర పచ్చడి మనదేలే ....అంటూ అందరికి లేని ఆకలి పుట్టించి  నోరూరించేల పాడి, నటించి (తప్పు..తప్పు..ఆ పాత్రలో జీవించి).

  యిలా ఒకటేమిటి నవరసాలు  నీ పాటలతో మాకు రుచి చూపించేశావు.మా మాట సరే. నీ పాటల ఆటలు,అల్లరులు.. మా పిల్లలు,పిల్లల పిల్లలు వీళ్ళందరికి కూడా నువ్వు నీ పాట వినిపించాలి కదా.గాన గాంధర్వుడవు కదా. నీ జోల పాట,లాలి పాట,భక్తి పాట వినిపించకుండానే అలా నవ్వుతూ నీ మానాన నువ్వు  వెళ్ళిపోతే ఎలా...?.

అస్సలు నీకో విషయం చెప్పనా.. నువ్వు ఏ భాషలో పాడినా ఆ  బాషకే అందం వస్తుంది.అది ఏ బాష అయినా నీ పాటతో నీ భాషగా అక్కున చేర్చేసుకుంటావు కదా.నీ పాటే కాదు నీ మాట కూడా పొందికగా అందంగా ఉంటుంది.అంత  స్వచ్ఛమైన పద ఉచ్చారణ నీది.

అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.నిన్ను బాలు అని పిలుస్తునప్పుడల్లా   ఎవ్వరికీ నీ వయస్సు గుర్తు రాదేంటి (అందులో నేనూ కూడా ఉన్నాననుకో).
 
కానీ  నువ్వు పాడిన  ఆ నలుగురు అనే పాట నా గుండెని పిండేసిందోయ్.అలాంటి పాటలు పాడి మమ్మల్ని బాధ పెట్టకు అని నీతో చాలాసార్లు  చెప్పాలనిపించింది.

  అన్నమయ్యలో నువ్వు ఎంతో ఆర్తిగా ఆంతర్యామి అలసితి సొలసితి ..... అని పాడిన పాట  ఎప్పుడూ విన్నా  నాకు ఎందుకో తెలీదు మాటలతో చెప్పలేని అనుభూతి.చాలా చాలా ఇష్టంగా అంతే కష్టంగా ఉండేది.బహుశా ఆ వేంకటేశ్వర స్వామికి కూడా నీ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించి యిలా ఈ వంకతో నిన్ను తన వెంట తీసుకుని వెళ్లిపోయాడేమో అని అనిపిస్తోంది.

చివరిగా ఈ ఒక్క మాట వినేసి వెళ్ళు... 
 చినుకులా రాలి.. నదులుగా సాగి.. వరదలై పోయి కడలిగా పొంగు నీ పాటలతో మా  అందరి హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన నువ్వు ఎప్పటికి చిరంజీవిగా ఉండిపోతావు.చెప్పలేక చెబుతున్నా...యిక    సెలవని...
             🙏🙏🙏🙏🙏

         

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

అమ్మ చేతి ముద్ద

My morning run

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే