ఉందిలే మంచి కాలం. ..ముందు ముందున
మొబైల్ లో పాత సినిమా పాట...ఉందిలే మంచికాలం ముందు ముందున ...అని చిన్నగా వినిపిస్తోంది. చలికాలం అవ్వటంతో నెమ్మదిగా చీకటితో పాటు చలిగాలి కూడా పెరుగుతోంది. అప్పటిదాకా వాకింగ్ చేసి కాసేపు పాట వింటూ రిలాక్స్ అవుదామని కూర్చున్నానో లేదో ఎవరో వస్తున్న అలికిడికి నేను వెంటనే మాస్క్ తగిలించేసుకుని జాగ్రత్త పడిపోయా.మా పక్క ఫ్లాట్ వాళ్ళు వాకింగ్ చేయటానికి టెర్రస్ మీదకి వచ్చి నన్ను చూసి గబ గబా మాస్కులు తగిలించేసుకుని నాకు ఆమడ దూరంగా వాకింగ్ చేయటం మొదలు పెట్టారు. యిక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టెర్రస్ దిగి యింటికి వచ్చేసా.
ఈ కరోన దెబ్బకి మా డాబా మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది.రోడ్డు మీద,పార్కులో వాకింగ్ చేసే మా అపార్ట్మెంట్ వాసులు అందరూ డాబా బాట పట్టారు.మాలో మేము ఒక ఒప్పందం చేసుకుని స్టిఫ్టుల ప్రకారం కొంతమంది పొద్దున్న,కొంతమంది సాయంకాలం వాకింగ్ చేస్తున్నాం .
అబ్బాబ్బా... ఈ మాస్కులు వాడి వాడి చెవులు విపరీతమైన మంట. యిలానే కొన్నాళ్ళు పెట్టుకుంటే చెవులు ముందుకు పొడుచుకుని వచ్చి ఏలియన్స్ లా అయిపోవడం ఖాయం. అందరి మొహాలకి మాస్కులయితే ఉంటున్నాయి. కానీ ఏం లాభం.. వారి వారి సౌకర్యం కొద్దీ కొంతమంది మూతికి,మరికొద్దిమంది గెడ్డానికి తగిలించుకుంటున్నారు.అక్కడక్కడ అరా కోరా.. ముక్కుకి తగిలించే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి.
మాస్కులంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యన టీవీలో చూశా. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో మనవడు పుట్టిన రోజు వేడుక చాలా బాగా సెలబ్రేట్ చేశారులెండి.అబ్బా...ఏమి జనం...ఏమి జనం.ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారులెండి.విచిత్రం ఏమిటంటే అక్కడ ఎవ్వరికీ మాస్కులు లేవు. ఆది చూసిన తరువాత అనిపించింది అంతమంది జనంలో తోసుకుని ముందుకు వెళ్లలేక కరోన వెనుతిరిగి వెళ్లి పోయిందా...లేక వీళ్ళు అందరూ ముందుగానే టీకాలు తీసేసుకున్నారా అని...? ఏమో ఏదైనా జరగొచ్చు అని నా గట్టి అనుమానం. యిది యింకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు కానీ మునిపటిరోజులు మళ్లీ రావేమో అనిపిస్తోంది.చిన్నప్పుడు BC ,AC(క్రీస్తు పూర్వం, క్రీస్తు తరువాత) అని చదువుకున్న రోజులు ..మాటలు అవే కానీ అర్థం మారి BC, AC(కరోన ముందు,కరోన తరువాత) అని ముందు ముందు చరిత్రకి ఎక్కుతామేమో అని అనిపిస్తోంది.
ఈ సోషల్ డిస్టెన్స్,మాస్కులు, సానిటైజర్లు ఎంతగా మన జీవితంలో భాగం అయిపోయాయి అంటే చివరకి టీవీలో పాత సినిమా చూస్తున్నా అరె... వీళ్ళు మాస్కు పెట్టుకోవటం మరిచిపోయారేంటి అని ఒక్క క్షణం కంగారు పుడుతోంది. కలలో కూడా యిదే పరిస్థితి...అందరూ మస్కులతోనే కనిపిస్తున్నారు. పొరపాటునో ,అవసరం వుండొ ఎవరైనా ఇంటి కాలింగ్ బెల్ కొడితే ఈ టైం లో ఎందుకు వచ్చాడురా బాబు అనే టెన్షన్.వచ్చినవాళ్ళు అలా వెళ్ళగానే యిల్లంతా సానిటైజర్ స్ప్రే చేసేయ్యటాలు,చేతులు తెగ కడుక్కోవటం.ఎవరో గాని మహానుభావులు సరదాగా చెప్పినా నిజం చెప్పారు. చేతులు కడగక పోతే అయుష్షు రేఖ,కడిగితే ధన రేఖ పలచబడి పోతాయేమో అన్న భయం.అన్నట్లు యిలా పొద్దస్తమానం చేతులు కడుగుతూ పోతూ ఉంటే చేతిలో రేఖలు అరిగి పోయీ అప్పుడెప్పుడో ఆధార్ కార్డ్ మీద ఉన్న నా ఫింగర్ ప్రింట్ మారిపోయి ఆ కార్డులో ఉంది నేను కాదంటారేమో అన్న డౌబ్ట్ కూడా కొత్తగా వస్తోంది.
ఎప్పుడైనా తప్పనిసరియై బయటకి వెళ్ళాల్సివస్తే ఏదో సాహసయాత్ర చేయబోతున్నంత ఫీలింగ్ .రోడ్డు మీద ఎవరైనా ఎదురు పడితే దొంగని చూసినట్లు దూరంగా పారిపోవడం.(అదృష్టం కొద్ది ఆ మాస్కులో వాళ్ళ ఫీలింగ్స్,ఎక్స్ప్రెషన్స్ మనకు కనిపించవు అనుకోండి).అలా ఎదురుపడే వాళ్ళల్లో కొంతమందికి మాస్కులు ఉంటాయనుకోండి.కానీ దాని వాలకం చూస్తే ఉతికి ఎన్నాళ్ళయిందో అని భయం వేస్తూ ఉంటుంది.యిలా బయటకి వచ్చినప్పుడల్లా ఎన్నో అర్థం లేని భయాలు, డౌట్స్.
మన చుట్టూ మరికొంతమంది మహానుభావులు ఉంటారు.కరోన మాకు బాగా దగ్గర చుట్టం.మమ్మల్ని ఏమి చేయదు అన్నంత ధీమాగా ఏ మాత్రం టెన్షన్ పడకుండా మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మనకి రాసుకుంటూ, పూసుకుంటూ మన మధ్యే తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే మనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. కానీ ఏమీ అనలేము అప్పుడప్పుడూ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి తెగ ముచ్చట వేసేస్తూ ఉంటుంది కూడా. యిలా వీళ్ళని చూసి చూసి వారం పది రోజుల క్రితం నేను కూడా అలానే మాస్క్ లేకుండా తిరగాలని గట్టిగా డిసైడ్ అయ్యానో...లేదో కరోన స్టెయిన్ కొత్తగా పుట్టుకొచ్చాడు.వీడు మందులకి మాట వినే రకం కాదు అని ఫ్లాష్ న్యూస్.ఈ దెబ్బకి ఒకటికి,రెండు మాస్కులు తగిలించుకుని ఆ ఒకనొకడు ... ఆ ఒకనొకరోజు... ఆ గబ్బిలం తిని ఉండబట్టే కదా మనకి యిన్ని కష్టాలు ..అని అ తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండలేకపోతున్నా.
అసలు హాయిగా ఆరుబయట తిరిగి ఎన్నాళ్ళు అయ్యిందో కదా అనిపించింది.అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అనిపించింది...స్వేచ్ఛలో ఉన్న ఆనందం, సుఖం అది పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది అని.
(యింతలో మొబైల్ లో పాట ఆగిపోయి చిత్ర విచిత్రమైన శబ్దం.)
ఎవరో కాల్ చేస్తున్నట్లున్నారు. ఒక సంవత్సర కాలంగా దాన్ని సానిటైజర్లతో తలంటి పోసి పోసి మొబైల్ లోపలకి నీళ్లు వెళ్ళిపోయి ఎవరైనా కాల్ చేసినప్పుడల్లా యిది రకరకాలుగా కొత్త కొత్త రింగ్ టోన్స్ తో నన్ను భయపెడుతోంది.యిది నన్ను భయపెడుతోందో,లేక తలంటి పోయవద్దని గట్టిగా వేడుకుంటోందో అర్థం కావటం లేదు. కానీ తప్పదు కొన్నాళ్ళు ఈ తిప్పలు.
ఘంటసాల గారు అన్నట్లు ఉందిలే మంచి కాలం ముందు ముందున.అందరూ సుఖపడాలి నందనందానా...మంచికాలం వచ్చేస్తోంది. మరి అప్పటిదాకా (అదేనండి టీకాలు తీసుకునేదాకా) మనమందరం జాగ్రత్తగా ఉందాం.
అందరూ బాగుండాలి.అందరిలో మనమూ ఉండాలి..
*********
Well Said..
ReplyDeleteThankyou so much
DeleteSo nice..
ReplyDeleteThankyou so much
Delete